
మాదిగలపై కేసీఆర్‌ది కపట ప్రేమ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం కేసీఆర్ మాదిగలపై కపట ప్రేమ చూపుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం పార్శిగుట్టలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దళితుల్లో సమర్థవంతమైన నాయకుడు లేడని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కడియం కేసీఆర్‌కు తొత్తుగా మారి దళితుల ఆత్మగౌరవాన్ని కించ పరుస్తున్నారు. నిజాం కళాశాలలో జరిగిన బహిరంగ సభ కేసీఆర్ భజన సభగా మారింది.
దళిత ద్రోహిగా కడియం శ్రీహరిని పరిగణిస్తాం. అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ లాంటి దళిత నాయకులు ఈ దేశంలో సమర్థవంతమైన పాత్ర పోషించిన విషయాన్ని ఆయన మరిచిపోయారు. సమైక్య ఆంధ్రాలో దళితులకు 6 మంత్రి పదవులుండగా... తెలంగాణలో ఒక్కటి కూడా లేకపోవడం కేసీఆర్ వివక్షకు నిదర్శనం. సొంత నియోజకవర్గంలో దళిత యువతిపై అత్యాచారం జరిగితే కనీసం నష్టపరిహారం కూడా ప్రకటించలేని మంత్రి ఈటల రాజేందర్ మాదిగల సభకు ఎలా రాగలిగారు? చంద్రబాబు, కేసీఆర్ ఒక్కటయ్యారు. దానికి నిదర్శనం నన్ను మిర్యాలగూడలో అరెస్టు చేయడమే. తెలంగాణలో మాదిగలను అణగదొక్కే కుట్రను అడ్డుకుంటాం. కేసీఆర్ మాకు ప్రధాన శత్రువు. వచ్చే నెల 3 లోపు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే క్రమంలో సీఎం సమక్షంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలి’ అన్నారు.