హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం అధికార పార్టీ టీఆర్ఎస్పై ఒత్తిడి తేవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. శనివారం నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మందకృష్ణ మాట్లాడారు. ఈ నెల 18 లోపు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు.
లేనిపక్షంలో ఈ 19న ఇందిరాభవన్ వద్ద ధర్నా చౌక్లో అఖిలపక్షం, మాదిగ దండోరా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రతినిధులను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తుందని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.