
వర్గీకరణపై కేసీఆర్ వైఖరి చెప్పాలి
కోదాడఅర్బన్: తెలంగాణ ఉద్యమంలో మాదిగలను తన అవసరానికి ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యంలో కోదాడలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత కేసీఆర్ మాదిగలలో ఒక వర్గాన్ని ప్రలోభపెట్టి ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
మాదిగల ఓట్లతో అధికారం దక్కించుకున్న కేసీఆర్ ఎన్నికల తరువాత వారిని మరిచిపోయారని విమర్శించారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచేందుకు ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణపై కేసీఆర్ ఇప్పటికైనా తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు గాను మెదక్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎమ్మార్పీఎస్ మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీస్ నాయకులు గంధం పాండు, ఏపూరి రాజు, ఏపూరి రోశయ్య, గంధం బంగారుబాబు, బల్గూరి దుర్గయ్య, చీమా శ్రీనివాసరావు, కర్ల కాంతారావు, నెమ్మాది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.