వర్షం దెబ్బకు సిటీ కార్లు ఢమాల్
ఒక్కరోజు కురిసిన భారీ వర్షం హైదరాబాద్ వాసులను అల్లకల్లోలం చేసింది. బుధవారం నాడు కురిసిన వర్షం మిగిల్చిన నష్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారీ వర్షంతో పలుచోట్ల నీళ్లు నిలిచిపోగా.. చాలాప్రాంతాల్లో నడుం లోతుకు పైగా నీళ్లున్నాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీళ్లు చేరుకున్నాయి. చివరకు రోడ్ల మీద వెళ్తున్న కార్ల లైట్లు కూడా మునిగిపోయేంత స్థాయిలో నీళ్లొచ్చాయి. ఈ ప్రభావం ప్రధానంగా కార్లు, ద్విచక్ర వాహనాల మీద ఎక్కువగా కనిపించింది. చాలా కార్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
ఇంజన్లలోకి నీళ్లు వెళ్లిపోవడంతో కదల్లేక మొరాయిస్తున్నాయి. ఇళ్ల బయట, సెల్లార్లలోను, ఆఫీసుల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలు ఎక్కువగా పాడైనట్లు తెలుస్తోంది. అప్పటికే ఆఫీసులకు వెళ్లిపోయినవాళ్లు వర్షం గురించి తెలిసినా.. బయట ఉన్న తమ వాహనాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ చూడాలనుకున్నా వెళ్లగలిగేలా లేదు. వర్షం తగ్గిన తర్వాత తమ వాహనాలు చూసుకుంటే.. ఎక్కడ ఉన్నవి అక్కడే ఆగిపోయాయి తప్ప కదిలే పరిస్థితి లేదు. తమ కారు ఆగిపోయింది.. టోయింగ్ చేయాలంటూ ఒక్కో టోయింగ్ సర్వీసుల వాళ్లకు వందలాది ఫోన్ కాల్స్ వెళ్లాయి. వర్షాల కారణంగా కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోనే రెండువేల కార్లు పాడైనట్లు ట్రాఫిక్ కంట్రోల్ రూంకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సైబరాబాద్ నుంచి ఇలాంటివి మరో 2వేల కాల్స్ వచ్చాయి.
ఇవి కాక ప్రైవేటు టోయింగ్ సర్వీసుల వాళ్లకు 1000-1500 కాల్స్ వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికీ చాలా సర్వీసు సెంటర్లలో చాలా కార్లు రిపేర్ల కోసం వేచి ఉన్నాయి. తనకు యాప్రాల్, మల్కాజిగిరి, హబ్సిగూడ లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా తమ వాహనాలను తీసుకెళ్లాలంటూ కాల్స్ వచ్చాయని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉండే టోయింగ్ సర్వీసు యజమాని సత్తార్ సాహెబ్ చెప్పారు.
ద్విచక్రవాహనాల పరిస్థితి కూడా అలాగే ఉంది. రోడ్లన్నీ చెరువులను తలపించడం, తప్పనిసరిగా ఆ నీళ్లలోంచే వెళ్లాల్సి రావడంతో బైకుల సైలెన్సర్లలోకి నీళ్లు వెళ్లిపోయాయి. దాంతో అవి ఆగిపోయి.. వాటిని తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వాటన్నింటినీ రిపేర్లు చేయించుకోడానికి తల ప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికీ చాలా వాహనాలు షెడ్లలోనే ఉన్నాయి. శుక్రవారం సమ్మె కావడంతో బస్సులు తిరక్కపోవడం, మరోవైపు తమ వాహనాలు షెడ్లకే పరిమితం కావడంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు.