మారథాన్ అదిరింది!
- ఉత్సాహంగా సాగిన ఎయిర్‌టెల్ హైదరాబాద్ రన్
- నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన పరుగు
- 10కే మహిళా విభాగంలో నల్లగొండ బిడ్డ దూకుడు
సాక్షి, హైదరాబాద్: టీనేజీ కుర్రాళ్లు.. పాతికేళ్ల యువకులు.. ఉద్యోగులు.. మహిళలు.. రిటైరైన పెద్దలు.. ఒకరి అడుగులో ఒకరు అడుగులేస్తూ సాగిపోయారు.. వెనకబడ్డ వారికి ముందున్న వారు స్ఫూర్తి రగిల్చారు.. పోటీ పడుతూనే తోటివాళ్లు కూడా లక్ష్యాన్ని అందుకోవాలని ఆశపడ్డారు.. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా పరుగులు పెట్టారు. దాదాపు 11 వేల మంది ఔత్సాహికులు పాల్గొన్న ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ ఉల్లాసంగా సాగింది. ఆదివారం నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్‌లో హైదరాబాదీలతో పాటు ఇతర రాష్ట్రా లు, విదేశాలకు చెందిన రన్నర్లు పాల్గొన్నారు.
మహిళల విభాగంలో విజేతలు..
ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు)లో మహారాష్ట్రకు చెందిన జ్యోతి గవాటే 2 గంటల 59 నిమిషాల 9 సెకన్లతో (2:59:09)తొలిస్థానంలో నిలిచింది. ఇథియోపియాకు చెందిన రుత్ ఎంజరి 2:17:39 గంటలు, హివోటా టీ 2:33:5 గంటలతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. హాఫ్ మారథాన్ (21.1 కి.మీ.)లో పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్ (1:31:52 గంటలు), సీమ (1:32:15 గంటలు), సిమ్టా (1:44:26 గంటలు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే రన్ విభాగంలో 40 నిమిషాల 27 సెకన్ల (40:27)తో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వై.నవ్య తొలి స్థానంలో నిలిచింది. 40:52 నిమిషాలతో యామిని, 43:46 నిమిషాలతో శిల్ప ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
పురుషుల విభాగంలో విజేతలు..
ఫుల్ మారథాన్‌లో ఇథియోపియాకు చెందిన మెస్ఫిన్ మెల్సె బల్లక్ 2:32:16 గంటలతో తొలిస్థానం ఆక్రమించాడు. 2:32:21 గంట లతో ఫిలిప్ రెండో స్థానంలో, 2:33:5 గంటల తో టిటస్ మూడో స్థానంలో నిలిచారు. హాఫ్ మారథాన్‌లో పంకజ్ కుమార్ 1:10 :25 గంటలు, శంకర్ క్షేత్రి 1:11:44 గంటలు, దీపక్ కుమార్ 1:12:56 గంటలతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే రన్‌ను కుల్దీప్ 32:33 నిమిషాలు, సతేందర్ 32:35 నిమిషాలు, విపిన్ కుమార్ 32:51 నిమిషాల్లో పూర్తిచేశారు. వీరందరికీ భారతి ఎయిర్‌టెల్ తెలంగాణ, ఏపీ సీఈవో వెంకటేశ్ విజయ రాఘవన్, ఈవెంట్ అంబాసిడర్ ఫిల్ మాఫిటోన్, నగర రేస్ డెరైక్టర్ మురళి, కేర్ ఆస్పత్రి తరఫున మహేందర్ పాల్ నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.