
తిరుపతి ఆభరణాలపై న్యాయ పోరాటం: మర్రి
ప్రజల సొమ్ముతో తిరుపతి వెంకన్నకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆభరణాలు సమర్పించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజల సొమ్ముతో తిరుపతి వెంకన్నకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆభరణాలు సమర్పించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించే నిధులతో ఏర్పాటు చేసిన కామన్గుడ్ ఫండ్‌ను శిథిలావస్థలో ఉన్న ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకోసం వాడాలన్నారు.
తిరుపతికి చెల్లించిన ఆభరణాల కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకోవడం చట్ట విరుద్ధమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇందిరాపార్కు నుంచి ధర్నాచౌక్‌ను తరలించాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదని, ఇది నిరంకుశమైన చర్య అని శశిధర్‌రెడ్డి విమర్శించారు. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, దాన్ని లేకుండా చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు.