‘తమ్మిడిహెట్టి’తోనే గరిష్ట ప్రయోజనం | Maximum benefit with the "Tammidihetti ' | Sakshi
Sakshi News home page

‘తమ్మిడిహెట్టి’తోనే గరిష్ట ప్రయోజనం

Published Sat, Apr 9 2016 12:11 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

‘తమ్మిడిహెట్టి’తోనే గరిష్ట ప్రయోజనం - Sakshi

‘తమ్మిడిహెట్టి’తోనే గరిష్ట ప్రయోజనం

ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టు మొదటి డిజైన్‌లో ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నీటి మళ్లింపుతోనే రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలున్నాయని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు స్పష్టం చేశారు.

♦ ఇక్కడి బ్యారేజీ వద్ద తక్కువ ఖర్చుతో వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవచ్చు
♦ ‘ప్రాణహిత’పై రిటైర్డ్ ఈఎన్‌సీ హనుమంతరావు ‘ప్రజెంటేషన్’
♦ హాజరైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు, జేఏసీ చైర్మన్ కోదండరాం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టు మొదటి డిజైన్‌లో ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నీటి మళ్లింపుతోనే రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలున్నాయని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు స్పష్టం చేశారు. ప్రాణహిత ద్వారా లభించే నీటిని తమ్మడిహెట్టి వద్ద గరిష్టంగా వినియోగిస్తేనే ప్రాజెక్టుపై ఆర్థిక, విద్యుత్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇక్కడ తీసుకున్నా, ఇంకా మనకు దక్కాల్సిన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన ‘ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి’ అన్న అంశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనాసభా పక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ రైతు విభాగపు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, జలసాధన సమితి నేత నైనాల గోవర్ధన్‌తోపాటు లోక్‌సత్తా, ఆప్, న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హాజరుకాలేదు.  

 తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీలు తీసుకోవాలి
 తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై ఇప్పటి వరకు శాస్త్రీయంగా అధ్యయనం జరగలేదని హనుమంతరావు తెలిపారు. శాస్త్రీయంగా నీటి లభ్యత తేలాలంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, రూర్కీ వారిచే అధ్యయనం చేయించాలన్నారు. కేంద్ర జల సంఘం లెక్కల మేరకు తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉందని అన్నారు. మేడిగడ్డతో పోలిస్తే తమ్మిడిహెట్టి 50 మీటర్ల ఎత్తులో ఉన్నందున, పంపింగ్‌కు అయ్యే చార్జీలు మిగులుతాయన్నారు. తమ్మడిహెట్టి ఎత్తు 148 మీటర్లు లేక 152 మీటర్లు అన్న చర్చ అనవసరమని, ఏ ఎత్తులో నిర్మించినా నిర్ణీత నీటిని మళ్లించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎత్తు తగ్గింపుతో బ్యారేజీ సామర్థ్యం తగ్గితే ఆ నీటిని ప్రస్తుతం 180 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న రిజర్వాయర్లలో ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చన్నారు.

 ఇక 71 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌ల నిర్మాణం మెదక్ జిల్లాలో చేస్తున్నారని, ఇక్కడ తాగు, సాగు అవసరాల కోసం ఏడాది పొడవునా నీరుంచాలంటే ఈ నీటిలో 20 శాతం ఆవిరి నష్టాలు, సీపేజ్ నష్టాలుంటాయన్నారు. అదీగాక రిజర్వాయర్లను నింపేందుకు 148 మీటర్ల ఎల్లంపల్లి నుంచి 600 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్‌కు పంపింగ్ చేయాలంటే విద్యుత్ అవసరం చాలా ఎక్కువని, ఈ దృష్ట్యా ఈ రెండు బ్యారేజీలను అదే సామర్థ్యంతో తమ్మిడిహెట్టి, ఎల్లంపల్లిల మధ్య ఏర్పాటు చేస్తే గ్రావిటీ ద్వారా నీరొస్తుందన్నారు. దీంతో పంపింగ్‌కు అయ్యే విద్యుత్ నష్టాలు తగ్గి, వ్యయం కూడా తగ్గుతుందన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిషా లేవనెత్తిన అభ్యంతరాల దృష్ట్యా కరకట్టలు కట్టుకోవాలని కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్‌కు సూచించిందని, అదే మాదిరి తమ్మిడిహెట్టి వద్ద కరకట్ట కట్టే అవకాశం పరిశీలించాలని అన్నారు. కరకట్టల వల్ల మహారాష్ట్రలో ముంపు నివారణ చేయవచ్చని, 148 మీటర్ల ఎత్తులోనే దీన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈయన అభిప్రాయంతో హనుమంతరావు సైతం ఏకీభవించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీడిజైన్ వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి 83 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. తాను సూచించిన ప్రకారం చేస్తే సుమారు రూ.20 వేల కోట్లు ఆదా అయ్యే అవకాశముందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement