‘మేయర్’ ఎన్నిక ఏర్పాట్లు చకచకా..
కౌన్సిల్ హాలు ముస్తాబు
తొలుత కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
ఎక్స్‌అఫీషియోలకు విప్ లేదు...
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నిక గురువారం జరుగనుండటంతో ఆ కార్యక్రమాల వేదిక అయిన జీహెచ్‌ఎంసీలోని కౌన్సిల్ హాల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గత పాలకమండలి సర్వసభ్యసమావేశాలన్నీ ఈ కౌన్సిల్‌హాల్‌లోనే జరిగాయి. గతంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలు జూబ్లీహాల్‌లో జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆ ఎన్నికలు సైతం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌హాల్‌లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలో పాల్గొనే 217 మంది ఓటర్లకు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడంతోపాటు వాటికి నగిషీలు చెక్కుతున్నారు. అవసరమైన చోట రంగులు వేస్తున్నారు. కౌన్సిల్ సభ్యులందరికీ ప్రిసైడింగ్ అధికారి, తదితరుల మాటలు స్పష్టంగా వినపడేందుకు, కార్పొరేటర్ల ప్రమాణ కార్యక్రం.. ఎన్నికయ్యాక మేయర్, డిప్యూటీమేయర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సవ్యంగా సాగేందుకు మైకులు, లైట్లు, ఏసీలు తదితరమైనవి సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. సభాధ్యక్షస్థానంలో మేయర్ కుర్చీని ఘనంగా తీర్చిదిద్దారు. పైఅంతస్తులోని విలేకరుల గ్యాలరీ, తదితర ప్రదేశాల్లోనూ లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీవీల ద్వారా ప్రత్యక్షప్రసారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కోసం పన్వర్‌హాల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎక్స్ అఫీషియోలకు విప్ లేదు..
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఉన్నా అది ఎక్స్‌అఫీషియో సభ్యులకు వర్తించదు. కేవలం ఎన్నికైన కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుందని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) కె.సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఓటర్లయిన కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం వారి పార్టీలు జారీ చేసే విప్‌లు వర్తిస్తాయని ఇప్పటి వరకు భావించారు. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, జీహెచ్‌ఎంసీ రికార్డుల మేరకు వారు టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విప్ అంశం ప్రస్తావనకొచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నికైన కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
పెరుగుతున్న టీఆర్‌ఎస్ బలం
సోమవారం వరకు ఎక్స్‌అఫీషియోలతో కలుపుకొని మేయర్‌ను ఎన్నుకునేందుకు టీఆర్‌ఎస్‌కున్న బలం 133 కాగా, తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ బలం 134కు పెరిగింది. ఆమేరకు టీడీపీ బలం తగ్గింది. టీఆర్‌ఎస్‌కు తమ అభ్యర్థిని మేయర్‌గా గెలిపించుకునేందుకు స్పష్టమైన మెజారిటీ బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ, ఆపార్టీలో చేరుతున్నవారితో ఇది మరింత పెరుగుతోంది.