సెటిలర్‌కు డిప్యూటీ మేయర్?
11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణం
♦ అదేరోజు గ్రేటర్ మేయర్, డిప్యూటీల ఎన్నిక
♦ ఎక్స్‌అఫీషియోలతో సహా ఓటర్లు 217 మంది
♦ కోరం సంఖ్య 109
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్పొరేటర్లలో నుంచి ఒకరిని మేయర్‌గా ఎన్నుకోనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. కొత్త మేయర్ ఎవరు కానున్నారనే చర్చలు ఓవైపు సాగుతుండగానే, డిప్యూటీ మేయర్ ఎవరవుతారన్నది సైతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో రెండు పదవులూ వారికే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని సెటిలర్స్‌కు ఇవ్వాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఉంటున్నవారంతా తమ బిడ్డలేనని సీఎం కేసీఆర్ ప్రకటించడమే కాక, తెలంగాణేతరులకు సైతం కార్పొరేటర్లుగా టిక్కెట్లివ్వగా, గెలిచిన వారు కూడా గణనీయంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ పదవిని వారికివ్వాలని టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌హాల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. మేయర్, కార్పొరేటర్లకు కొత్త కుర్చీలను సిద్ధం చేస్తున్నారు. గత పాలకమండలిలో మేయర్ ఎన్నికను జూబ్లీహాల్లో నిర్వహించగా, ఈసారి కౌన్సిల్‌హాల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ ఎన్నికకు ఓటర్లయిన 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఇప్పటికే సమాచారం పంపారు.
మేయర్ ఎన్నిక సందర్భంగా ఎక్స్‌అఫీషియో సభ్యులకు మొదటి వరుసలో, కార్పొరేటర్లకు పార్టీల బలాలను బట్టి ముందు వరుసల్లో బారికేడ్లతో సహా కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికకు విప్ వర్తిస్తుందని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) కె.సురేంద్రమోహన్ తెలిపారు. మేయర్ పదవికి ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను వీడియో తీయడంతోపాటు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
కోరం సంఖ్య 109..: కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యు లకు ( మొత్తం 217 మందికి) మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకునేందుకు ఓటుహక్కు ఉంది. ఇందులో కనీసం 50%.. అంటే 109 మంది హాజరు ఉంటే కోరం ఉన్నట్లు లెక్క. కోరం ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే గంటసేపు వేచిచూసి, మర్నాటికి వాయిదా వేస్తారు. మర్నాడూ ఇదే ప్రక్రియ ఉంటుంది. ఆ రోజూ కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదించి, దాని ఆదేశాల మేరకు చర్యలు చేపడతారు.