- నడిరోడ్డుపై ప్రార్థనా స్థలాలు
- తొలగించాలంటూ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
- ఈ ప్రక్రియకు అడుగడుగునా అనేక అడ్డంకులు
బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా కొనసాగుతున్న ప్రార్థనా స్థలాలను తొలగించడం లేదా తరలించడమో చేయాలి
- 2010 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశం
‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం పట్టణాలు, నగరాల్లో రోడ్లపై అనుమతి లేకుండా అడ్డంగా వెలిసిన ప్రార్థనా స్థలాలను నెల రోజుల్లోగా తొలగించాలి
- గత వారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని సైతం ఈ తరహా ప్రార్థనాస్థలాలకు అతీతం కాదు. అడుగడుగునా ఇవి ట్రాఫిక్ అడ్డంకులను సృష్టిస్తూనే ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా... ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేదు. దాదాపు 40 నెలల క్రితం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కదిలించలేదు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నెల రోజుల గడువుతో కూడిన ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రాఫిక్ విభాగం గణాంకాల ప్రకారం నగరంలో ఈ తర హా ప్రార్థనా స్థలాలు 253 వరకు ఉన్నాయి. ఈ తరహా ఒక్క ప్రార్థనాస్థలం కూడా లేని అరుణాచల్‌ప్రదేశ్‌ను ‘నాగరిక రాష్ట్రం’గా సుప్రీం కోర్టు గతంలో అభివర్ణించింది. దీన్ని బట్టి చూస్తే నగరానికి ‘నాగరికత’ అందనంత దూరంలో ఉందనే విషయం స్పష్టమవుతోంది.
ఎక్కువ, తక్కువ... పాతబస్తీలోనే...
నగర ట్రాఫిక్ కమిషనరేట్‌లో 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించడంతో పాటు ఇతర సమస్యలకు కారణమవుతున్న ప్రార్థనా స్థలాలపై గతంలోనే సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 253 వరకు ‘అక్రమ’ ప్రార్థనా స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యధికం, అత్యల్పం కూడా పాతబస్తీలోనే కనిపించాయి. ఫలక్‌నుమలో సిటీలోనే ఎక్కువగా 43 ఉన్నాయి. ఇవి అనేక ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అతి తక్కువగా ఉన్నది కూడా ఓల్డ్‌సిటీలోని చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోనే. ఇక్కడ ఒక్క ప్రార్థనా స్థలమే ఇబ్బందికరంగా ఉంది. నగరంలో ఉన్న ఈ ‘ఆక్రమణల్లో’ మసీదులు, చిల్లాలు, దర్గాలు 129, ఆలయాలు 117, చర్చ్‌లు ఏడు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
తొలగింపు ప్రహసనమే...
అనేక సందర్భాల్లో ట్రాఫిక్ నరకానికి, కొన్నిసార్లు శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతున్న ఈ అనధికారిక ప్రార్థనా స్థలాల తొలగింపు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. నగరంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. 2009లో కోఠిలోని ఉమెన్స్ కాలేజీ బస్టాప్ వద్ద ఉన్న నల్లపోచమ్మ టెంపుల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు ‘తాకడం’తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని.. దాదాపు ఆరు గంటల పాటు ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న దర్గాల జోలికి వెళ్లినప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మరోపక్క రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అడ్డంగా ఉన్న శ్మశానాల్లో కొంతభాగం సేకరించడానికే కొన్ని ఏళ్ల పాటు అధికార యంత్రాంగం శ్రమించాల్సి వచ్చింది. ఈ అనుభవాల దృష్ట్యా అధికారులు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆదేశాలను ఎలా అమలు చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.
సమష్టిగా ముందుకెళ్తేనే...
ఏళ్లుగా వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ విభాగాల వల్ల మాత్రమే కాదు. అన్ని వర్గాలు, శాఖల అధికారులు సమష్టిగా ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని ముసారాంబాగ్, ఐఎస్ సదన్ తదిరత ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఒకే చోట ఉన్నాయి. వీటి విషయం వచ్చేసరికి తరచు ఎదురవుతున్న మాట ‘ముందు వారిది తొలగించండి’. ఈ కారణంతోనే ఏళ్లుగా సమస్యలు అలాగే నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో కంటే సంబంధిత పర్వదినాలప్పుడు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం కేవలం నెల రోజుల్లో వీటికి పరిష్కారం చూపడం సాధ్యం కాదంటున్న అధికారులు... ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ చర్య తీసుకున్నా కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు
ఈ సమస్యను పరిష్కరించాలంటే నగర పోలీసులు ఏర్పాటు చేసిన పీస్ కమిటీల మాదిరిగా ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాల వారీగా సాధారణ పౌరులు, అధికారులు, భిన్న వర్గాల పెద్దలు, వ్యాపార సంఘాల నాయకులతో వీటిని ఏర్పాటు చేయాలంటున్నారు. అంతా కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని సదరు ప్రార్థనా స్థలం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, దాని వల్ల వస్తున్న సమస్యలను క్షేత్రస్థాయిలో చర్చించాలని, పూర్తిగా తొలగించే విషయం కాకపోయినా కనీసం ఇబ్బందులు లేని స్థానాలకు వీటిని మార్చడానికి అందరినీ ఒప్పించగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. అయితే ఎలాంటి వివాదం లేని ప్రత్యామ్నాయ స్థలాలను చూపడానికి జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలంటున్నారు.