
గ్రేటర్‌లో కొత్త సబ్‌వే
మెహదీపట్నం రైతుబజార్ వద్ద..
ప్రతిపాదనలు సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ
అంచనా వ్యయంరూ. 2 కోట్లు
పీపీపీ పద్ధతిలో.. త్వరలో టెండర్లు
సిటీబ్యూరో మెహదీపట్నం రైతు బజార్‌వద్ద పాదచారుల కష్టాలు తప్పించేందుకు సబ్‌వే నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దాదాపు రూ. 2 కోట్లు వ్యయం కాగల దీనిని పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్నారు. ఇక్కడ గంటకు సగటున 1500 మంది రోడ్డు దాటుతున్నారు. రోడ్డుకు రెండు వైపులా బస్టాప్‌లున్నాయి. వాటిని చేరుకునేందుకు తీవ్ర ట్రాఫిక్ ఇక్కట్లతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు సబ్‌వే (అండర్‌గ్రౌండ్ రోడ్) అవసరమని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో అందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం పంపించారు. ఆమోదం పొందగానే టెండరు ఆహ్వానించనున్నారు. పీవీఎన్‌ఆర్ ఎలివేటెడ్‌ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్లు 13, 14ల మధ్య ఈ సబ్‌వేను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక్కడ రోడ్డును దాటే పాదచారుల్లో ౖరైతు బజార్‌కు వచ్చే రైతులతోపాటు పాఠశాల, కళాశాలల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజెన్ల దాకా ఎందరో ఉన్నారు.
సదుపాయంగా..
గతంలో 1980లలో కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద రెండు సబ్‌వేలను నిర్మించినప్పటికీ నిరుపయోగంగా మారాయి. నిర్వహణలోపంతో అవి పనికిరాకుండాపోవడంతో అలాంటిపరిస్థితి తలెత్తకుండా సబ్‌వేల్లో ప్రజలకుపకరించే వివిధ సదుపాయాలు ఏటీఎంలు, ఆయా అవసరాలు తీర్చే కియోస్క్‌లతోపాటు చిరువ్యాపారాలు చేసుకునే వారిని అనుమతించాలని భావిస్తున్నారు. తద్వారా ఎప్పుడూ వాడకంలో ఉంటుందని భావిస్తున్నారు. కోఠి సబ్‌వేకు వినియోగంలోకి తెచ్చేందుకు తగిన చర్య లు చేపట్టాలని రెండేళ్ల క్రితం భావించారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.