హైదరాబాద్: ఓటును అడిగేందుకు వచ్చే కాంగ్రెస్, టీడీపీ నాయకులను నిలదీయాలని తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ నేత కే తారకరామారావు గ్రేటర్ వాసులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఒక్కసారైనా హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టారా? అని ఆయన ప్రశ్నించారు. రంగారెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
మోదీ దేశంలో తిరగడం మాని.. ప్రపంచదేశాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మా తాతలు నేతులు తాగారు.. మా మూతుల వాసన చూడండి అన్నట్టు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే టైంలో 10శాతం సమయం మనం ఏం చేశామని జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలోచిస్తే మంచిదని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి తమకే సాధ్యమని, వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమనే గెలిపించాలని ఆయన కోరారు.
20 నెలలైనా మోదీ ఎందుకు రాలేదు!
Published Mon, Dec 21 2015 3:57 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement