మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం
ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ భూముల వ్యవహారంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని విద్యార్థి సంఘాల నాయకలు పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్, అధ్యక్షులు కోటూరి మానవతరాయ్, అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి ఆర్ట్స్ కళాశాల ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో చదువుకొని కేటీఆర్ ఓయూ భూములను తీసుకుంటే తప్పెంటని పేర్కొనడం దారుణమన్నారు.
ఓయూ భూములు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పూర్వికులు సంపాదించినవి కాదని, అవి విద్యార్థుల సొత్తని అన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఓయూ భూముల పరిరక్షణ కోసం జూన్ 1న ఓయూలో ‘విద్యార్థి నిరుద్యోగుల సింహగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీయడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఓయూ భూముల జోలికొస్తే ఊరుకోం:ఎన్‌టీవీపీ
సరూర్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ భూముల జోలికొస్తే ఊరుకోబోమని నవ తెలంగాణ విద్యార్ధి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం బాలాపూర్ చౌరస్తాలో ఓయూ భూముల ఆక్రమణలను వ్యతిరేకిస్తూ సూర్ణగంటి రంజిత్‌కుమార్ అధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన తాము మరో ఉద్యమం చేసి గద్దె దింపుతామని హెచ్చరించారు. చదువుల తల్లి సరస్వతి కొలువైన నేలను లాక్కొని ఇళ్లు కట్టిస్తానననడం సబబు కాదన్నారు. కేసీఆర్ తన ఫాంహౌస్‌లను ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దిలిఫ్, అశోక్, వంశీ, సాయి, రోహిత్, శివ, రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు.