‘మిషన్’ సక్సెస్
♦ భారీ వర్షాలతో ‘మిషన్ కాకతీయ’ చెరువుల పరిధిలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు
♦ సుమారు 8.50 మీటర్ల మేర పెరుగుదల
♦ రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో సర్వే చేసి తేల్చిన భూగర్భ శాఖ
♦ మంత్రి హరీశ్‌రావు హర్షం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరణ చేసిన చెరువుల కింద సుమారు 8.50 మీటర్ల మేర జల మట్టం పెరిగిందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. మిషన్ కాకతీయ వల్లే ఈ ఫలితాలు వచ్చినట్టు పేర్కొంది. భూగర్భ జలవనరుల మట్టం పెరుగుదలపై జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఆ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులను పైలట్‌గా తీసుకొని భూగర్భ జల వనరుల శాఖ ఈ అధ్యయనం జరిపింది.
ఎక్కడెంత పెరిగాయి?
రాష్ట్రవాప్తంగా కురిసిన వర్షాలతో మహబూబ్‌నగర్ మినహా అన్ని జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్ ప్రాంతంలో గతేడాది మేలో జలమట్టం 12.04 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం (సెప్టెంబర్ నాటికి) 8.92 మీటర్లకు పెరిగింది. ప్రస్తుతం కేవలం 3.12 మీటర్ల వద్దే నీళ్లు లభిస్తున్నారుు. అలాగే కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గతేడాది మేలో భూగర్భ జలాలు 13.68 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 9.13 మీటర్లకు పెరిగింది. ఖమ్మం జిల్లా సుబ్లేడు ప్రాంతంలో గతేడాది మేలో 10.12 మీటర్ల లోతులో ఉండగా.. ఇప్పుడు 5.5 మీటర్లకు పెరిగాయి. ప్రస్తుతం 4.62 మీటర్లలోనే నీటి లభ్యత ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో గతేడాది భూగర్భ జలాలు 24.31 మీటర్ల లోతుకు పడిపోగా.. ప్రస్తుతం 1.81 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు మిగతా జిల్లాల్లో మాదిరి పెరగలేదు. మెదక్ జిల్లా సిద్దిపేటలో గతేడాది మేలో 17.85 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండగా.. 15.17 మీటర్ల మేర పెరిగాయి. 2.68 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంది. నల్లగొండ జిల్లా బి.వెల్లెంలో గత మేలో భూగర్భ జలాలు 18.57 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 9.63 మీటర్ల మేర పెరిగాయి. 8.94 మీటర్ల వద్ద నీటి లభ్యత ఉంది. నిజామాబాద్ జిల్లా చేపూర్‌లో గతేడాది మేలో 20.30 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా ప్రస్తుతం 10.24 మీటర్లకు పెరిగాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతంలో గతేడాది 30.70 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ప్రస్తుతం 9.10 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు భూగర్భ జల వనరుల శాఖ తన నివేదికలో తెలిపింది. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల కింద భూగర్భ జలాలు పెరగడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు, మిషన్ కాకతీయ పనులు రైతుల్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దోహదపడతాయన్నారు.
భూగర్భ జలాల్లో పెరుగుదల ఇలా.. (మీటర్లలో)
2015 2016
జిల్లా సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్
మహబూబ్‌నగర్ 13.99 15.57 13.21
రంగారెడ్డి 14.20 13.96 10.22
మెదక్ 21.09 22.97 14.05
నిజామాబాద్ 16.12 14.32 13.01
ఆదిలాబాద్ 6.57 6.20 5.11
కరీంనగర్ 10.77 9.97 7.77
వరంగల్ 10.12 9.88 6.10
ఖమ్మం 5.56 8.19 6.47
నల్లగొండ 11.07 15.47 9.90
హైదరాబాద్ 7.86 8.15 3.96
సగటు 11.74 12.47 8.98