
ఇంటికి వెళ్లను.. నన్ను చంపేస్తారు..
►రోజుకు 16 గంటలు పనిచేస్తున్నా
►అమ్మానాన్నలు చిత్రహింసలు పెడుతున్నారు
►పోలీసులను ఆశ్రయించిన బాలిక
అమీర్‌పేట: మా అమ్మానాన్నలు రోజుకు నాతో 16 గంటలు పనిచేయిస్తున్నారు..ఒళ్లు హూనమైపోతోంది.. వెళ్లకపోతే చిత్రహింసలు పెడుతున్నారు..నన్ను చంపేస్తారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సొంత తల్లి, సవతి తండ్రి బాలికతో వెట్టిచాకిరీ చేయిస్తూ వచ్చే సంపాదనను దర్జాగా ఖర్చుచేస్తున్నారు. బడికి వెళ్లాల్సిన బాలిక భారంగా బతుకులాగుతోంది. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. రాజమండ్రికి చెందిన పుష్ప బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనుక నివాసముంటోంది. భర్తను వదిలిపెట్టిన ఆమె అంకిరెడ్డి అనే వ్యక్తితో జీవనం సాగిస్తోంది. మొదటి భర్త కూతురు అయిన రాణి (11)కూడా వారితోపాటే ఉంటోంది. తల్లిదండ్రులు బాలిక చదువు మాన్పించి ఒక ఇంటర్నెట్ సెంటర్, రెండు హాస్టళ్లలో పనిచేయిస్తున్నారు. దాదాపు రోజుకు 16 గంటలపాటు వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.అలా వచ్చే నాలుగు వేల రూపాయలను సైతం తీసుకుని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం తాను పనికి వెళ్లనని రాణి చెప్పింది. ఆగ్రహించిన తల్లి, సవతితండ్రి ఇనుప కత్తెరతో ఎడమ కన్నుపై తీవ్రంగా దాడిచేశారు. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ బాధలు భరించలేక నేరుగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తల్లి పుష్ప, సవతి తండ్రి వలన తనకు ప్రాణభయముందని, వారితో ఉండనని పోలీసులను వేడుకుంది. అయితే ఈ విషయంపై పోలీసులు ఆదివారం రాజీ కుదిర్చి బాలికను తల్లి, హాస్టల్ నిర్వాహకులతో పంపినట్లు తెలిసింది.
రాజీ చేయడమేమిటి: బాలల హక్కుల సంఘం
తనకు ప్రాణభయం ఉందని బాలిక కన్నీరు పెట్టుకున్నా తల్లితో రాజీ కుదిర్చి తిరిగి పంపించడం ఏమిటని బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షురాలు అనురాధరావు మాట్లాడుతూ వెంటనే బాలికను రక్షణ కల్పించి తల్లి,సవతి తండ్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. చాకిరి చేయించుకున్న ఇంటర్నెట్, çహాస్టల్స్ నిర్వాహకులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
శిశుసంక్షేశాఖ అధికారులకు సమాచారమిచ్చాం
బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై ధర్యాప్తు జరుపుతున్నామని ,చిత్రహింసలు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు. స్త్రీశిçశుసంక్షేమశాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు.