నగదు బదిలీ...
నేటి నుంచి అమలు సిలిండర్ ధర రూ.952
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో అమలు
మొదటి మూడు నెలలు మినహాయింపు
మరో మూడు నెలలు అదనపు అవకాశం
సిటీబ్యూరో: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీకి (డీబీడీ) శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.952గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా తొలివిడత వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అమలయ్యే జిల్లాల్లో హైదరాబాద్-రంగారెడ్డి కూడా ఉన్నాయి. ఇక వినియోగదారులు సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం పూర్తి స్థాయిలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఆధార్ నంబర్‌తో సంబంధం లేదు. విని యోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే అందులో సబ్సిడీ నగదు రూపంలో జమవుతుంది.
ఇదీ ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహ వినియోగదారులు ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన వారి సంఖ్య 22.24 లక్షలు. మరో 6.74 లక్షల వినియోగదారులు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. ఖాతా లేని వారికి మొదటి మూడు నెలలు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతుంది. అ తర్వాత మరో మూడు నెలలు అదనపు మినహాయింపు కాలంగా వెసులుబాటు కల్పిస్తారు. ఈలోగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం కాని వారు పూర్తి స్థాయి మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గడువులోగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుంటే అప్పటి వరకు తీసుకున్న సిలిండర్ సబ్సిడీమొత్తాన్ని నగదుగా పొందే వెసులుబాటు కల్పించారు.
గతంలో పరిస్థితి..
గతంలో వంటగ్యాస్‌కు ఆధార్‌తో ముడిపెట్టి, న గదు బదిలీని అమలు చేశారు. ఇది వినియోగదారులకు చుక్కలు చూపించింది. మొత్తం తొమ్మిది నెలలు అమలైనప్పటికీ... మొదటి మూడు నెలల పాటు మినహాయింపు కాలంగా పరిగణించారు. ఫలితంగా ఆధార్ అనుసంధానం కాని వారికీ సబ్సిడీ వర్తించింది. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ ఒకటి నుంచి 2014 ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయి డీబీటీ అమలు కావడంతో వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. ఆధార్‌అనుసంధానం కాని వారు సిలిండర్‌కు పూర్తి స్థాయి ధర ను చెల్లించాల్సి వచ్చింది.