వంటగ్యాస్‌పై వ్యాట్ వాత!
* 32.71 లక్షల వినియోగదారులపై రూ. 7.19 కోట్ల వ్యాట్ భారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలోని మూడు జిల్లాల్లో శనివారం నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. తొలిదశలో పథకం అమలవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని వినియోగదారులు ఇకపై రాయితీయేతర సిలిండర్‌కు రూ. 952 ధర చెల్లించాలి. తర్వాత ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. ఇంతమొత్తాన్ని ఒకేసారి చెల్లించడమే పేద, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు తలకు మించిన భారం కాగా, వ్యాట్‌రూపంలో మరో రూ. 22 అదనంగా వడ్డించబోతున్నారు.
తొలిదశలో 3 జిల్లా ల్లో ఉన్న 32.71 లక్షల మంది వినియోగదారులపై వ్యాట్ రూపంలో సుమారు రూ. 7.19 కోట్ల భారం పడనుంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తేనే రాయితీ మొత్తం రూ. 508 వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందని, లేకుంటే వ్యాట్ మినహాయించి రూ.486 ఖాతాలో పడుతుందని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. రాయితీరహిత సిలిండర్ ధర రూ. 952లో 5 శాతం అంటే రూ. 45 వరకు వ్యాట్ ఉంటుంది. వినియోగదారుడు చెల్లించే ధర రూ. 444 పోనూ... మిగతా రూ. 508లో వ్యాట్ రూ. 22 వరకు ఉంటుంది. ఈ మొత్తం పోగా మిగిలిన రూ. 486 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమయ్యే అవకాశముంది.
అయితే వ్యాట్ ను తెలంగాణ ప్రభుత్వం భరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు చమురు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై శనివారం స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే నగదు బదిలీ మార్గదర్శకాలను ప్రకటించిన ప్రభుత్వం ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. నగదు బదిలీకి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుందని, ఎల్పీజీ కనెక్షన్‌కు ఖాతాను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాలో జమవుతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా.. ఈ 3 నెలలు రాయితీ ధరకే సిలిం డర్ అందిస్తామని ప్రకటించింది.
నగదు బదిలీ అమలు కానున్న 3 జిల్లాల పరిధిలో దాదాపు 32.71 లక్షల మంది వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 25.04 లక్షల మంది వినియోగదారులకే బ్యాంకు ఖాతాల అనుసంధానం జరి గింది. ఈ లెక్కన 74.9 శాతం మందే శనివారం నుంచి నగదు బదిలీ పరిధిలోకి వస్తారు. మిగతా వారికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే సబ్సిడీ సిలిండర్‌ను అందజేస్తారు. 3 నెలల్లో వీరు తమ గ్యాస్ కనెక్షన్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి.
గ్యాస్ అక్రమ మార్గాలను నివారించేందుకే దీన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కింద ఆధార్‌తో సంబంధం లేకుండా వినియోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే సబ్సిడీ నగదు రూపంలో బదిలీ అవుతుందని హెచ్‌పీసీఎల్ సీనియర్ మేనేజర్, రాష్ట్రస్థాయి సమన్వయకర్త శ్రీనివాస్, ఎల్పీజీ ముఖ్య ప్రాంతీయ మేనేజర్ ఎంబీ ఇంగోలే శుక్రవారం స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోని వినియోగదారులకు నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీపై సిలిండర్ సరఫరా జరుగుతుందన్నారు. ఆ తర్వాత మరో మూడు మాసాల (మే 14) వరకు అదనపు మినహాయింపుకాలంగా పరిగణిస్తామని వివరించారు. ఆలోగా అందరూ నగదు బదిలీ పథకంలోకి మారాలని కోరారు.