కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అయ్యర్
బాలానగర్: ఔషధాల పరిశోధన మరింత వేగవంతంగా, ఫలవంతంగా జరగాలని, ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి హన్సరాజ్ గంగారామ్ అయ్యర్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూ ఆఫ్ ఫార్మసూటికల్స్ అండ్ రీసర్చ్ ఆడిటోరియంలో ఔషధాల తయారీలో ఆధునిక ఆవిష్కరణలు (ఐపీబీడీ-2015) అనే అంశంపై గురువారం అవగాహన సదస్సును కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయతో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఎన్‌ఎంఆర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్సరాజ్‌గంగారామ్ అయ్యర్ మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ నైపర్‌లో ఔషధ పరిశోధనలు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. నేటి ఫార్మా కంపెనీల అధినేతలు ఒకప్పుడు ఐడీపీఎల్ ఉద్యోగులే నని ఆయన గుర్తు చేశారు.
ప్రసుత్తం క్యాన్సర్, హెచ్‌ఐవీ వంటి భయంకరమైన వ్యాధులకు సరైన మందులు లేవని, వీటిని నివారించేందుకు కొత్త ఔషధాలు కనుగొనాలని కోరారు. పరిశోధనలకు అయ్యే ఖర్చు భరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో త్వరగా నయం అయ్యే మందులను కనుగొని ఫార్మా రంగంలో నైపర్ ఖ్యాతిని నిలబెట్టాలని కోరారు.
బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సరికొత్త పద్ధతుల ద్వారా అత్యాధునిక పరిజ్ఞానంతో మందులను కనుగొన్నప్పుడే నైపర్‌కు పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. ఐడీపీఎల్‌కు పూర్వ వైభవాన్ని నైపర్ విద్యార్థులు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం, నైపర్ ప్రాజెక్టు డెరైక్టర్ అహ్మద్ కమల్, నైపర్ రిజిస్ట్రార్ సత్యనారాయణ, కార్యక్రమ కన్వీనర్లు ఎల్.శ్రీనివాస్, నాగేంద్రబాబు, ఫార్మా విద్యార్థులు పాల్గొన్నారు.