
బల్లలు చరచడానికే... మా పాత్ర పరిమితం
అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెగ మధనపడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం రావడం లేదు. చివరకు ప్రశ్నోత్తరాల్లో తాము వేసిన ప్రశ్నలు కూడా రాకపోవడంతో ఖాళీగా కూర్చుంటున్నారు. విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మాట్లాడే అవకాశం వస్తోందని, తమకు సబ్జెక్టు ఉన్నా, మాట్లాడాలన్న తపన ఉన్నా అదృష్టం కలసి రావడం లేదం టూ బాధపడిపోతున్నారు.
‘సీఎం మాట్లాడినప్పుడో.. మంత్రులు మాట్లాడినప్పుడో.. పాలక పక్షానికి మద్దతుగా బల్లలు చరచ డానికి మాత్రమే మా పాత్ర పరిమితం అవుతోంది... ఏ కొద్దిమందికో అవకాశం దక్కినా, వారితోనే మళ్లీ మళ్లీ మాట్లాడిస్తున్నారు..’ అంటూ ఓ యువ ఎమ్మెల్యే వాపోయారు. ఇదే పరిస్థితి ప్రభుత్వ విప్‌లకూ ఎదురవుతోంది. ‘ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రశ్న వేయడానికి లేదు.. సభా నాయకుడు అవకాశం ఇస్తే తప్ప ప్రభుత్వం తరఫున ఏదైనా అంశంలో సమాధానం ఇవ్వడమో, చర్చలో పాల్గొనడమో చేయలేం...’ అంటూ ప్రభుత్వ విప్ ఒకరు మనసులో మాట బయట పెట్టారు.
దీంతో సభ్యులు తాము ఏ సబ్జెక్టుపైనా ప్రిపేర్ కావడం లేదని, అసెంబ్లీకి రావడం.. పోవడం తప్ప మరో ప్రయోజనమే కనిపించడం లేదంటున్నారు. అసెంబ్లీ ప్రసారాలను టీవీల్లో చూసే నియోజకవర్గ ప్రజలు తమను ఎక్కడ తక్కువ అంచనా వేస్తారోనన్న భావన తమ మనసులను అల్లకల్లోలం చేస్తోందని చెబుతున్నారు.