
అగని అక్రమ దందా!
విదేశాల నుంచి యథేచ్ఛగా బంగారం తరలింపు
ఆగస్టులోనే 10 కిలోలకు పైగా రవాణా
తాజాగా పొట్టలో మాదక ద్రవ్యాలు తీసుకొచ్చిన మహిళ
సంచలనాలకు కేంద్ర బిందువుగా విమానాశ్రయం
శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా తీరు సంచలనంగా మారుతోంది. ఓ వైపు కస్టమ్స్ అధికారులు భారీగా తనిఖీలు చేపట్టినా అక్రమార్కులు రోజుకో కొత్త ఐడియాతో పసిడిని విదేశాల నుంచి తీసుకొస్తున్నారు. దీంతో ఎంతకూ బంగారం అక్రమ రవాణాకు పుల్‌స్టాప్ పడడం లేదు. ఆదివారం అమెరికా మహిళా మూసా మోజియా (34) ఏకంగా తన కడుపులో మాదకద్రవ్యాల ప్యాకెట్లు తీసుకురావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆరు నెలల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడు కూడా తన కడుపులో 400 గ్రాముల బంగారం ఉండలు మింగి తీసుకురాగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు విరేచనాల ద్వారా బంగారాన్ని బయటకు తీశారు. తాజాగా అమెరికా మహిళ కూడా కడుపులో రూ. 50 లక్షలు విలువచేసే మాదకద్రవ్యాల ప్యాకెట్లను తీసుకురాగా.. ఉస్మానియా వైద్యులు అందులో కొన్నింటిని బయటకు తీశారు.
ఆగస్టులో అత్యధిక బంగారం..
గతేడాది 2014-ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి 2015 మార్చి 31 వరకు మొత్తం రూ. 39 కోట్ల విలువ చేసే 127 కేజీల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని 125 కేసులు నమోదు చేశారు. విమానాశ్రయం ఏర్పాటు తర్వాత గత ఆర్థిక సంవత్సరంలోనే భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 25 కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆగస్టు మాసంలో పది కేజీలకుపైగా బంగారం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కాగా, అక్రమార్కులు రోజుకో కొత్త ఐడియాతో పసిడిని తీసుకొస్తున్నారు. ఏడాది కిందట ఓ వ్యక్తి బంగారు బిస్కెట్లను తన మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారంతో పాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ చర్చనీయాంశంగా మారింది.