పాతబస్తీలో శుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. అల్లరి మూకలు హద్దులు దాటేందుకు ప్రయత్నించగా...పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు.అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
చార్మినార్/ శాలిబండ/ సైదాబాద్/ యాకుత్‌పురా : చెదురు మదురు ఘటనలు మినహా మక్కా మసీదులో శుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఘటన నేపథ్యంలో శుక్రవారం జరిగిన మక్కా మసీదులో జరిగే ప్రార్థనలకు ప్రాధాన్యత ఏర్పడింది. పాతబస్తీకి చెందిన ప్రజలందరూ ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసుకోవాలన్న పోలీసుల సూచనలకు స్థానికులు పూర్తిగా సహకరించారు. తక్కువ సంఖ్యలో ప్రార్థనలకు వచ్చినప్పటికీ.. కొంతమంది యువకులు ప్రార్థనల అనంతరం మక్కా మసీదు నుంచి బయటికి వస్తూ ‘నారే తక్ధీర్’... ‘అల్లాహ్ హో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తూ మొఘల్‌పురా అగ్నిమాపక కేంద్రం వైపు పరుగు తీశారు.
అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో విధులు నిర్వహిస్తున్న మీర్‌చౌక్ ఏసీపీ ఎస్. గంగాధర్ కాలుకు గాయమైంది. అనంతరం అల్లరిమూకలు హఫీజ్‌ఢంకా మసీదు, రిలయన్స్ వద్దకు చేరుకొని పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టారు. మొఘల్‌పురా ఇషత్ ్రమహాల్ ఫంక్షన్ వైపు పెద్ద ఎత్తున చేరుకున్న యువకులు హరిబౌలి చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. స్థానికంగా ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేసుకునేందుకు ముందుకొచ్చిన అల్లరిమూకలను పోలీసులు అడ్డుకొని తరిమికొట్టారు.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు ఇషత్ ్రమహల్ ఫంక్షన్ హాల్, రిలయన్స్ కేఫ్ వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. హరిబౌలీ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న మొఘల్‌పురా ఎస్సై రాజేశ్‌తో పాటు కానిస్టేబుల్ రాఘవులు తలకు రాయి తగలడంతో గాయమైంది. మొఘల్‌పురా ఓల్టా హోటల్ వద్ద ఆమన్‌నగర్-బి, మురాద్‌మహాల్, చాచా గ్యారేజీ వైపు నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న యువకులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని కవరేజ్ చేయడానికి వచ్చిన నవీన్ అనే ఓ ఫొటోగ్రాఫర్‌కు రాయి తగలగడంతో గాయమైంది. వెంటనే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టీఎస్‌పీఎస్‌పీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అల్లరిమూకలను తరిమికొట్టారు.
ఘటనా స్థలానికి చేరుకున్న దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ పరిస్థితిని సమీక్షించి తన వెంట అదనపు బలగాలను తీసుకొని ముష్కరులను లోపల బస్తీల వరకు తరిమికొట్టారు. సుల్తాన్‌షాహి కవేలికమాన్ వద్ద కొందరు యువకులు పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. స్థానికంగా ఉన్న ఓ వ ర్గం వారి ఇళ్లపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. రాళ్లు రువ్వుతూ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల ప్లాస్టిక్ కుర్చీలను విరగొట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న అదనపు బలగాలు యువకులను తరిమికొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ రాళ్ల దాడిలో మొఘల్‌పురా అగ్నిమాపక కేంద్రం వద్ద బందోబస్తులో ఉన్న పోలీసు వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.
పరిస్థితిని సమీక్షించిన పోలీసు కమిషనర్....
పాతబస్తీలో శుక్రవారం మధ్యాహ్నం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితిని నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చార్మినార్ వద్ద ఉండి సమీక్షించారు, అదన పు కమిషనర్‌లు అంజనీ కుమార్ (శాంతి భద్రతలు) జితేందర్ (ట్రాఫిక్), సంయుక్త కమిషనర్‌లు నాగిరెడ్డి (స్పెషల్ బ్రాంచ్), శివ ప్రసాద్ ( సీఏఆర్ హెడ్ క్వార్టర్స్) పాతబస్తీలో జరిగిన రాళ్ల దాడి జరిగిన ప్రాంతాలను సందర్శించారు.
ఫలించిన పోలీస్ వ్యూహం....
శుక్రవారం జరిగిన సామూహిక ప్రార ్థనలు వారి వారి ప్రాంతాల్లోని స్థానిక మసీదుల్లోనే ప్రార్థనలకు హజరయ్యే విధంగా బస్తీ పెద్దలతో పాటు మత ప్రముఖులతో సమావేశం నిర్వహించిన పోలీసుల ప్రయత్నాలు సత్ఫలిచ్చాయి. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ కె. బాబురావులు తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. స్వల్ప సంఘటనలు జరగడంతో అటు పోలీసులతో పాటు ఇటు పాతబస్తీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియోల ఆధారంగా కేసులు...
పోలీసులు తీసిన వీడియోల ఆధారంగా అల్లర్లకు పాల్పడిన గుర్తించి కేసులు నమోదు చేస్తామని మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ ఎస్.గంగాధర్ తెలిపారు. ప్రస్తుతం మొఘల్‌పురా, సుల్తాన్‌షాహి, కవేలికమాన్, హరిబౌలి చౌరస్తా, ఓల్టా హోటల్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందన్నారు.
ముగ్గురు అనుమానితులపై కేసు...
సామూహిక ప్రార్థనల అనంతరం జరిగిన అల్లర్లపై మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ గంగారాం తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీతో పాటు వీడియోలలో చిత్రీకరించిన దృశ్యాలను పరిశీలించి మరిన్ని కేసులు నమోదు చేస్తామన్నారు.
చెదురుమదురు సంఘటనలు మినహా... పాతబస్తీ ప్రశాంతం
Published Sat, Apr 11 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM