సరదాగా అన్నా.. క్షమించండి: బాలకృష్ణ
హైదరాబాద్: మహిళల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, వారిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. 'సావిత్రి' సినిమా ఆడియో ఫంక్షన్ లో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే మన్నింపు కోరుతున్నానని అన్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరినట్టు భావించొద్దని కోరారు. మహిళలను ఇంటి ఆడపడుచులుగా చూడడం తమ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గుణం అని వివరించారు. సినిమా వేడుకలో సరదాగా మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, సినిమాలో కథాపరంగా సన్నివేశాల గురించి చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, బాలకృష్ణపై కేసు నమోదు చేయాలని న్యాయవాదుల జేఏసీ సోమవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాదులు తెలిపారు.