Savitri audio function
-
నా పాత్రకు అనుగుణంగా మాట్లాడా!
సావిత్రి ఆడియో ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ సాక్షి, హైదరాబాద్: నా పాత్ర ఎలా ఉండాలని జనం కోరుకుంటారో అదే మాట్లాడానని, దాన్ని వారు ఎలా తీసుకున్నారో ప్రజలనే అడగాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ఆయన ‘సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో నేను మాట్లాడిన మాటలకు ఎవరికి తోచిన రీతిలో వారు పెడర్థాలు తీశారు. మహిళలంటే తనకు గౌరవమని ఆనాడే చెప్పా. నేను రెండు రకాలుగా మాట్లాడా... ఎమ్మెల్యేగా కాదు ఒక నటుడిగా నా పాత్ర ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటారో అదే మాట్లాడాను. ఇక్కడ ఉన్న పది మందో వందమందో చెప్పింది కాదు. జనం అభిప్రాయం తీసుకోండి. నా మాటలను వారు ఎలా రిసీవ్ చేసుకున్నారో అడగండి. వాళ్లే చెబుతారు.. నా సినిమాల్లో మహిళలకు మంచి పాత్రలు ఇచ్చాను...’ అంటూ బాలకృష్ణ కొంత అస్పష్టంగా చేతులు తిప్పుతూ చెప్పారు. అక్కడున్న వారికి తెలుగు అర్థం కాదు.. వాళ్లంతా నా మాటలను ఎంజాయ్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. -
సరదాగా అన్నా.. క్షమించండి: బాలకృష్ణ
హైదరాబాద్: మహిళల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, వారిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. 'సావిత్రి' సినిమా ఆడియో ఫంక్షన్ లో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే మన్నింపు కోరుతున్నానని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరినట్టు భావించొద్దని కోరారు. మహిళలను ఇంటి ఆడపడుచులుగా చూడడం తమ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గుణం అని వివరించారు. సినిమా వేడుకలో సరదాగా మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, సినిమాలో కథాపరంగా సన్నివేశాల గురించి చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బాలకృష్ణపై కేసు నమోదు చేయాలని న్యాయవాదుల జేఏసీ సోమవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాదులు తెలిపారు. -
హీరో బాలకృష్ణపై ఫిర్యాదు
మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారు: అడ్వొకేట్ జేఏసీ హైదరాబాద్: ఓ సినీ వేడుకలో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినందుకు ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ జేఏసీ సోమవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం... ‘సావిత్రి’ సినిమా ఆడియో విడుదల వేడుకలో బాలకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సుంకరి జనార్దన్, రవికుమార్‌లు ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీనిపై న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకొంటామని సీఐ తెలిపారు.