‘నసిన్’ వెబ్‌సైట్ హ్యాక్
పాక్ హ్యాకర్ల పనిగా అనుమానం
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ అకాడెమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ (నసిన్) అధికార వెబ్‌సైట్ బుధవారం హ్యాకింగ్‌కు గురైంది. నగరానికి చెందిన కొందరు ఐఆర్‌ఎస్ అధికారులు ఈ హ్యాకింగ్ విషయం తొలుత గుర్తించారు. వీరు వెంటనే హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అకాడెమీని అప్రమత్తం చేశారు. తక్షణం రంగంలో దిగిన నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్ల పనిగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా వర్గాలతో పాటు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
‘నసిన్’లో ఐఆర్‌ఎస్ అధికారులతో పాటు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోల్లో పని చేయనున్న వారికి శిక్షణ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ శిక్షణ పొందిన ఐఆర్‌ఎస్‌ల్లో అనేక మంది ప్రస్తుతం నగరం కేంద్రంగా వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు నిత్యం ‘నసిన్’ వెబ్‌సైట్ అప్‌డేట్స్ కోసం వీక్షిస్తుంటారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వారికి హోం పేజ్ ఓపెన్ కాలేదు. ఆ స్థానంలో ‘హ్యాక్డ్ బై ఫైసల్ 1337’ అనే అక్షరాలు కనిపించాయి. తాము పాకిస్తాన్‌కు చెందిన సైబర్ ఎటాకర్స్ టీమ్‌కు చెందిన వారమంటూ.. సమాచారం కోసం ఫేస్‌బుక్ ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. చివరలో పాకిస్తాన్ జిందాబాద్ అని ఉంది. ఈ హ్యాకింగ్ వ్యవహారాన్ని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి.