‘కిక్కు’పై వీడని సస్పెన్స్‌! | National, State Road 140 on the wine shops .. | Sakshi
Sakshi News home page

‘కిక్కు’పై వీడని సస్పెన్స్‌!

Published Wed, Mar 8 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

‘కిక్కు’పై వీడని సస్పెన్స్‌!

‘కిక్కు’పై వీడని సస్పెన్స్‌!

జాతీయ, రాష్ట్ర రహదారులపై 140 వైన్‌ షాపులు..
తరలించేందుకు ఈనెల  ఆఖరుతో గడువు


సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న 140 మద్యం దుకాణాలు, బార్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆయా రహదారులకు ఆనుకొని 500 మీటర్ల లోపల ఉన్న దుకాణాలను మార్చి నెలాఖరులోగా రహదారులకు దూరంగా మరోచోటకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద స్పందించిన ఆబ్కారీశాఖ.. ఈ ఏడాది సెప్టెంబరు వరకు లైసెన్సు గడువు ముగియనున్నందున ఆయా దుకాణాలను అప్పటివరకు యధాస్థానంలో కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఈ నెలలో వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఆయా దుకాణాలు ప్రధాన రహదారులు, అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాలే కావడంతో ఏకంగా 140 దుకాణాలను తొలగించే అవకాశం ఉంది. దీంతో మిగతా దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగించడం, సమయపాలన పాటించకపోయే ప్రమాదం కూడా ఉందని ఆబ్కారీశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న కల్లు దుకాణాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుండడంతో కల్లు సొసైటీల సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా దిల్‌సుఖ్‌నగర్‌– ఎస్‌.ఆర్‌.నగర్‌ రూట్లో అధికంగా మద్యం దుకాణాలు, బార్లు ఈ జాబితాలో ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి.

గత నెలలో చీప్‌ లిక్కర్‌ సేల్స్‌ అదుర్స్‌
సిటీని గుడంబా రహిత నగరంగా తీర్చిదిద్దడంలో నగర ఆబ్కారీశాఖ విజయం సాధించడంతో ఇప్పుడు అల్పాదాయ వర్గాలు, దినసరి కూలీలు చీప్‌ లిక్కర్‌పై మక్కువ చూపుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. దీంతో చీప్‌లిక్కర్‌ సేల్స్‌ బాగా పెరిగాయి. ప్రధానంగా గుడంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌లో ఫిబ్రవరిలో ఏకంగా 273 శాతం అమ్మకాల్లో వృద్ధి నమోదవడం గమనార్హం. ఇక మలక్‌పేట్‌లో 61 శాతం, నారాయణగూడలో 48 శాతం, గోల్కొండలో 45 శాతం, చార్మినార్‌ ప్రాంతంలో 36 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదవడం విశేషం.

మద్యం చీర్స్‌ ఇక్కడే అత్యధికం..
చీప్‌లిక్కర్‌ స్థాయిలో కాకపోయినా రూ.700 లోపు (ఫుల్‌ బాటిల్‌) ధర ఉన్న మద్యం అమ్మకాలు కూడా నగరంలో ఫిబ్రవరి నెలలో అధికంగా జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణ మద్యంలో ధూల్‌పేట్‌లో 27 శాతం, జూబ్లీహిల్స్‌లో 24 శాతం, ముషీరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 5శాతం, చార్మినార్‌లో 11 శాతం, గోల్కొండలో 17 శాతం మేర అమ్మకాలు పెరగడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

నగరంలో 2016 ఆర్థిక సంవత్సరంలో
మద్యం అమ్మకాలు: రూ.1621 కోట్లు
2017లో మద్యం అమ్మకాలు: రూ.1756 కోట్లు
బీర్ల అమ్మకాల్లో వృద్ధి: 0.1 శాతం
మద్యం అమ్మకాల్లో వృద్ధి: 9 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement