నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు | Nayeem Den in Four Murders | Sakshi
Sakshi News home page

నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు

Published Sat, Aug 13 2016 2:07 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు - Sakshi

నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు

* అల్కాపురిలో టౌన్‌షిప్‌లోని అతడి నివాసం ఓ నరకకూపం
* అనేక మంది బాలికలపై అకృత్యాలు


సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అకృత్యాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్న ఇతడి డెన్‌లో నాలుగు హత్యలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైనవారిలో ఓ మైనర్ బాలికతోపాటు ఓ పసికందు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తేలింది. బాలికను కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపగా.. పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు తీశారు. కోర్టు అనుమతితో ఫర్హానా, అఫ్షాలను కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు.

నయీమ్‌కు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన టెక్ మధు.. నెలల రోజుల పిల్లల్ని సైతం తీసుకువచ్చి నయీమ్‌కు అప్పగించినట్లు వెల్లడైంది. అల్కాపురి టౌన్‌షిప్‌పై సోమవారం నార్సింగి పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడున్న 11 మంది పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది నయీమ్‌తో పాటు ఫర్హానా, అఫ్షాలతో ఎలాంటి సంబంధం లేనివారు ఉండటంతో వారిని సైదాబాద్, హైదర్షాకోట్‌ల్లోని శరణాలయాల్లో చేర్పించారు. వీరి నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఆ ఇంట్లో మొత్తం 24 మంది పిల్లలు ఉండే వారని గుర్తించారు.

తమలో ఇద్దరిని ఇటీవలే ఓ మహిళ తీసుకువె ళ్లిందని చిన్నారులు బయటపెట్టారు. మిగిలిన వాళ్లు ఏమయ్యారనే కోణంపై దృష్టిపెట్టిన పోలీసు ఫర్హానా, అఫ్షాలను ఆ కోణంలో ప్రశ్నించారు. నయీమ్ కొందరు పిల్లలు, యువతులతో పాటు 16 ఏళ్ల లోపు బాలికల్నీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిసింది. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.
 
బాలికలకు మత్తు మందు ఇస్తూ అకృత్యాలు..
నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నయీమ్ అనుచరులు యువతులతో పాటు బాలికలను ఉపాధి పేరుతో తీసుకువచ్చేవారు. వీరందరినీ తన ఆధీనంలోని తీసుకునే నయీమ్.. ఫర్హానాతో పాటు అఫ్షాలకు అప్పగించే వాడు. బాలికలకు మత్తమందులు ఇచ్చే నయీమ్ వారిపై శారీరక, మానసిక అకృత్యాలకు పాల్పడేవాడు. ఒప్పుకోని బాలికలను సున్నిత అవయవాలపై కొడుతూ హింసించేవాడు. నయీమ్ సమీప బంధువులు సైతం ఈ ఇంటికి వచ్చి వెళ్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఆపై గోవా, ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి అమ్మేసేవాడు.

నల్లగొండకు చెందిన ఓ బాలిక నయీమ్ అకృత్యాలను ఎదిరించింది. దీంతో నయీమ్, ఫర్హానా తదితరులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడి చేసి ఇంట్లోనే ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. ఆ దృశ్యం చూసిన మిగిలిన మైనర్లు కొన్ని రోజుల పాటు అన్నపానీయాలు సైతం ముట్టుకోలేదు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన బాలికలతో ఇంటిని శుభ్రం చేయించడంతో పాటు నయీమ్... ఆమె మృతదేహాన్ని వాహనంలో తీసుకువె ళ్లి మాయం చేశాడు.

ఇలా చాలామంది మైనర్లపై అకృత్యాలు జరిగినట్టు ఫర్హానా, అఫ్షాలు పోలీసు కస్టడీలో వెల్లడించారు. దీంతో శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులను ఆ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు పలు కీలకాధారాలు, నమూనాలు సేకరించారు. ఈ హత్య, మైనర్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ కేసులో హత్య తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లనూ చేర్చారు. కేసులో ఫర్హానా, అఫ్షాలతో పాటు నయీమ్ కుటుంబాన్నీ నిందితులుగా పేర్కొన్నారు.
 
కస్టడీ పొడిగించండి..
ఫర్హానా, అఫ్షా మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు కస్టడీ ముగియడంతో శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసింది. ఫర్హానా, అఫ్షాలకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. ఇప్పటికే చత్తీస్‌గడ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌ల్లో నయీమ్‌కు  స్థిర, చరాస్తులు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు తాజాగా ఫర్హానా, ఆఫ్షాలు చెప్పిన విషయాలతో జబల్‌పూర్, ముంబైల్లోనూ భారీగానే ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు.  
 
భూవివాదంలో ఇద్దరి హత్య
ముగ్గురు వ్యక్తులు కలిసి శంషాబాద్‌లో రూ.6 కోట్లకు ఓ చోట భూమి కొన్నారు.  గొడవలు రావడంతో వీరిలో ఓ వ్యక్తిని మిగతా ఇద్దరు కలసి పక్కనపెట్టేశారు. దీంతో అతడు నయీమ్‌ను కలిసి.. మ్యాటర్ సెటిల్ చేస్తే ల్యాండ్‌లో 30% వాటా ఇస్తానని చెప్పాడు. దీంతో నయీమ్ వారిద్దరిని తన ఇంటికి పిలిపించుకొని సంతకాలు పెట్టించుకున్నాడు. తర్వాత వారిని అల్కాపురిలోని తన ఇంటికి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశాడు. అనంతరం తనను మొదట కలిసి వ్యక్తికే 30% వాటా ఇచ్చి నయీమ్ ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement