వివాదాస్పద భూములే నయీమ్‌ టార్గెట్‌ | nayeem targets dispute lands | Sakshi
Sakshi News home page

వివాదాస్పద భూములే నయీమ్‌ టార్గెట్‌

Published Sat, Aug 20 2016 1:34 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

వివాదాస్పద భూములే నయీమ్‌ టార్గెట్‌ - Sakshi

వివాదాస్పద భూములే నయీమ్‌ టార్గెట్‌

రాష్ట్రంలో ఎక్కడ లిటిగేషన్‌ ఉన్నా వాలిపోవాల్సిందే
ఇందుకోసం ‘ప్రత్యేక’ నెట్‌వర్క్‌ ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదు


సాక్షి, హైదరాబాద్‌: సులభంగా డబ్బు సంపాదించేందుకు ల్యాండ్‌ సెటిల్‌మెంట్లే అత్యుత్తమ మార్గంగా గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎంచుకున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. రాష్ట్రంలో ఎక్కడ వివాదాస్పద (లిటిగేషన్‌) భూమి ఉన్నా.. అక్కడ క్షణాల్లో వాలిపోయేలా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపడింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి కేవలం లిటిగేషన్‌ భూముల మీదనే దృష్టి సారించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద భూముల సమాచారం తెలియగానే వాటిని ‘సెటిల్‌’ చేయడానికి నయీమ్‌ ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుంది. వారికి మాట వినకపోతే ‘భాయ్‌’ దగ్గర ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ అందిస్తారు. అక్కడ సెటిల్‌ అయ్యేలా.. అంతకుమించి వారికి మరోమార్గం లేకుండా చేసే ప్రణాళిక రూపొందించుకున్నారు.

పెద్ద డీల్‌ ఉన్న భూ లావాదేవీలన్నీ నయీమ్‌ కనుసన్నల్లోనే జరిగి నట్లు పోలీసులకు అనేక ఆధారాలు లభించాయి. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి నేతృత్వంలో గత పది రోజులుగా చేస్తున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారీ మొ త్తంలో ఆస్తులు వెలుగు చూడటంతో.. అందులోనూ భూముల వివరాలు బయటపడటంతో ఆ దిశగా సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నయీమ్‌ డెన్స్‌లలో లభించిన ల్యాండ్‌ డాక్యుమెంట్ల విలువ మదింపు చేసేందుకు రెవెన్యూ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ఈ మేరకు పుప్పాలగూడలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా లెక్కింపు కొనసాగింది. అలాగే మిగతా ప్రాం తాల్లో కూడా డాక్యుమెంట్ల విలువను లెక్కించాలని సిట్‌ యోచిస్తోంది.

సమాచారానికి ‘ప్రత్యేక’ నెట్‌వర్క్‌
భూ లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడుతుండటంతో నయీమ్‌ పూర్తిగా వాటి మీదే దృష్టి కేంద్రీకరించాడు. అందుకోసం అన్ని ప్రాంతాల్లో భూ లావాదేవీలకు సంబంధించిన సమగ్ర సమాచారం తనకు చేరేలా ‘ప్రత్యేక’ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బృందంలో రిజిస్ట్రేషన్‌ శాఖలో పనిచేసే కొంత మంది అధికారులు, డాక్యుమెంట్స్‌ రాసే వారినే నియమించుకున్నాడు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖలో పదవీ విరమణ పొందిన వారి సేవలను వినియోగించుకున్నాడు. వారి సేవలకుగాను ప్రతీ నెల పారితోషికాలు, నజరానాలు అందించినట్లు సిట్‌కు కొన్ని ఆధారాలు లభించాయి.

‘పెద్ద’ వ్యక్తులూ నయీమ్‌ వద్దకే..
నయీమ్‌ భూ లావాదేవీలు మొదట్లో నల్లగొండ జిల్లాకే పరిమితం కాగా.. ఆ తర్వాత క్రమంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్‌ జిల్లాలకు విస్తరించాయి. ఎంతటి వివాదాస్పద భూమైనా సరే నయీమ్‌ రంగ ప్రవేశం చేస్తే పరిష్కారం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ‘పెద్ద’ వ్యక్తులందరూ కూడా నయీమ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. వారి వివరాలన్నీ నయీమ్‌ తన డైరీలో రాసుకున్నట్లు తెలిసింది.

భారీగా నమోదవుతున్న కేసులు
నయీమ్, అతని అనుచరులపై కేసుల పరంపర కొనసాగుతోంది. వారి ఆగడాలకు సంబంధించి సిట్‌ ప్రకటించిన టోల్‌ఫ్రీ నంబర్‌కు 150కి పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. కొంత మంది బాధితులు ఆధారాలతో సహా స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 15, సైబరాబాద్‌ ఈస్ట్, వెస్ట్‌లలో 8, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4, కరీంనగర్‌ జిల్లాలో 4, నిజమాబాద్‌ జిల్లా ఒక కేసు నమోదయ్యాయి. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సమీక్షిస్తున్న పోలీసులు.. ఆధారాలు లభ్యమైతే మరిన్ని కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement