అతడి చుట్టూ 20 ఏళ్ల వయసున్న యువతులే!!
సాక్షి, హైదరాబాద్: ‘‘అతడి చుట్టూ 20 ఏళ్ల వయసున్న యువతులున్నారు. వారి చేతిలో ఆయుధాలున్నాయి.. నయీమ్ అతడి డెన్‌లో నాలుగు గంటల పాటు నాకు నరకం చూపించాడు. నన్ను బెదిరించినంత సేపు నయీం వెనుక ఒక యువతి తుపాకీ పట్టుకొని నిలబడి ఉంది. అడిగినంత డబ్బు ఇచ్చుకోలేనంటూ నేను నయీంను కాళ్లావేళ్లా ప్రాధేయపడేందుకు ముందుకు జరిగినప్పుడల్లా.. ఆమె వారించింది. నయీంను తాకనివ్వకుండా కనుసైగలతోనే బెదిరించింది..’- ఓ బాధితుడు స్వయంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇది! గ్యాంగ్‌స్టర్ నయీం వెనుక కీలకంగా వ్యవహరించేది యువతులే!! 24 గంటల పాటు అతడిని కాపాడేది వారే.
ఒక్క మాటలో నయీంకు వారే సైన్యం. వారం రోజులుగా నయీం ఆగడాలపై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మాయిలపై మోజుతో నయీమ్ ప్రతీక్షణం వారితోనే గడిపేవాడని సమాచారం. అతడు అచ్చంగా లిబియా నియంత గడాఫీ మాదిరిగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. నయాం తనకు కాపలాగా యువతులతో మూడంచల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. అంతేకాదు రక్షణ ఉండే అమ్మాయిలందరూ 20 ఏళ్ల లోపు వారే ఉండేటట్లు చూసుకున్నట్లు తెలిసింది.
అందుకు నయీం ప్రత్యేకంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ముంబైకి చెందిన కొందరు అమ్మాయిలను రప్పించుకున్నాడు. వారికి కొందరు నిపుణులతో ప్రత్యేక తర్పీదు ఇప్పించాడని సమాచారం. అవసరమైతే కొన్ని ‘ప్రత్యేక’ సెటిల్‌మెంట్లు చేయడానికి పూర్తిగా అమ్మాయిలనే ఉపయోగించేవాడు. కొన్ని హత్యల బాధ్యతలను సైతం వారికే అప్పగించేవాడట.
గతంలో నయీం ముఠా చేతిలో హత్యకు గురైన కోనపురి రాములు ఉదంతలోనూ ఒక మహిళ కీలక పాత్ర పోషించింది. రాములు హత్య కోసం ఆయుధాల సరఫరా, స్కెచ్‌కు అనుకూలమైన సమయం కల్పించడం కోసం వారినే ఉపయోగించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే రాములు హత్య తర్వాత ఒక మహిళ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. అలాగే కొన్ని సందర్భాలలో భూలావాదేవీలు సెటిల్‌మెంట్లు చేసేటప్పుడు వారితోనే డీల్ చేసేవాడని తెలిసింది.