నేడే నీట్-2 పరీక్ష
- హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష
- యాజమాన్య కోటా
- మెడికల్ సీట్లకు ఈ పరీక్షే కీలకం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)-2’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనుండడంతో ఈ పరీక్షకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ కాలేజీల్లోని మెడికల్ సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎంసెట్-2 నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆ కన్వీనర్ కోటాలో అవకాశం లభించని వారంతా ‘నీట్-2’కు పోటీ పడుతున్నారు. నీట్-2 ర్యాంకులతో రాష్ట్రం సహా దేశంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లోని సీట్ల కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక నీట్-2 ప్రవేశ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సహకారంతో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 27 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యార్థుల హాల్‌టికెట్లలో పొందుపరిచారు.