పది కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు
మైనారిటీలకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్
నియామక ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు నామినేటేడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. పది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మ న్లను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో మైనారిటీలకు పెద్దపీట వేశారు. ప్రకటించిన పది కార్పొరేషన్లలో ఐదింటిని మైనారిటీలకే కట్టబెట్టారు. ఇవన్నీ రాష్ట్ర స్థాయి పదవులు కావడం, కీలక పదవులు దక్కడంతో అధికార టీఆర్‌ఎస్‌లోని మైనారిటీ నేతల్లో ఆనందం వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వారితో పాటు ముఖ్య నేతల అనుచరులకు కూడా పదవులు దక్కాయి. రాజ్యసభ ఎంపీ కేశవరావు కుమారుడు విప్లవ్‌కుమార్‌కూ పదవి దక్కడం గమనార్హం.
కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
పది కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో సగం మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందంటూ.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు సరైన లబ్ధి కలిగిందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు.