అనాథ యువతికి కొత్త జీవితం
వివాహం నిశ్చయించిన స్టేట్ హోం అధికారులు
ఘనంగా నిశ్చితార్థం...ఫిబ్రవరిలో పెళ్లి
వెంగళరావునగర్: స్టేట్‌హోంలోనే చిరుద్యోగం చేస్తున్న ఓ అనాథ యువతికి గురువారం స్టేట్‌హోం అధికారులు వివాహ నిశ్చితార్థం జరిపించారు. గుంటూరుకు చెందిన నాగలక్ష్మి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు ఆమెను 2008లో నగరానికి తీసుకువచ్చి మధురానగర్‌కాలనీలోని ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు అదే ప్రాంగణంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ చిరుద్యోగిగా పని చేస్తూ జీవిస్తుంది. గత రెండు నెలల కిందట మోహిదీపట్నంలో నివాసం ఉండే ప్రతాప్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని, తగిన యువతి ఉంటే చూపించాలని స్టేట్‌హోం అధికారులను కోరారు. దీనికి స్పందించిన అధికారులు ప్రతాప్ కుటుంబ పరిస్థితిని, పూర్తి వివరాలను సేకరించి అతనికి నాగలక్ష్మిని ఇవ్వడానికి సమ్మతించారు.
ప్రస్తుతం నాగలక్ష్మి శిశువిహార్‌లో కేర్‌టేకర్‌గా పని చేస్తుంది. ఒకరికొకరు నచ్చడంతో గురువారం ఉన్నతాధికారుల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం జరిపించారు. కార్యక్రమానికి అమ్మాయి తరఫున పెద్దలుగా స్టేట్‌హోం రీజనల్ జాయింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, రిటైర్డ్ ఆర్‌డీడీ ప్రమోదినీ రాణి, ప్రాజెక్ట్ డెరైక్టర్ (హైదరాబాద్) ఆశ్రీత, రంగారెడ్డి జిల్లా పీడీ విజయలక్ష్మి, స్టేట్‌హోం ఇన్‌చార్జి బి.ఎన్.గిరిజ, చిల్డ్రన్స్‌హోం ఇన్‌చార్జి లక్ష్మీకుమారి, సర్వీస్‌హోం ఇన్‌చార్జి రసూల్, శిశువిహార్ ఇన్‌చార్జి కృపా స్వరూపా రాణి, రెస్క్యూహోం ఇన్‌చార్జి నిర్మల తదితరులు హాజరు కాగా, అబ్బాయి తరఫున తల్లిదండ్రులు పద్మావతి, దత్తాత్రి తదితర బంధువులు హాజరయ్యారు. ఇరువురి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన స్టేట్‌హోంలోనే జరుపనున్నట్టు అధికారులు తెలియజేశారు.