సిటీ హ్యాపీ
ఫలించిన నగర పోలీసుల వ్యూహం
∙ప్రశాంతంగా కొత్త ఏడాది వేడుకలు
‘జీరో యాక్సిడెంట్ నైట్’గా డిసెంబర్ 31
957 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు
సిటీబ్యూరో: కొత్త ఏడాది సిటీకి ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగాయి. ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా నమోదై అందరికీ సంతోషాన్ని మిగిల్చింది. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ అధికారులూ శనివారం రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. నగరంలోని కీలక ప్రాంతాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్‌లో నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు జరుపుకునే వారు సైతం ఇతరులకు ఇబ్బందులు కలుగజేయకుండా చర్యలు తీసుకున్నారు. మద్యం అమ్మకాలు సైతం సగానికి పడిపోయాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం.. వంటి ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందు జాగ్రత్త నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు.
ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా బేగంపేట, డబీర్‌పురా, సనత్‌నగర్ వంటి కొన్ని ఫ్లైఓవర్‌కు మాత్రమే మినహాయింపునిచ్చారు. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల వాహనాలను అనుమతించలేదు. పీవీ నర్సిహారావు ఎక్స్‌ప్రెస్ వేలోనూ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. జంట కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. వాహన చోదకుల వేగానికి కళ్లేం వేశారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్ 31 ప్రశాంతంగా ముగిసింది. శనివారం తెల్లవారుజాము 2 గంటల తరవాత ఫ్లై ఓవర్లు, 3 గంటలకు ట్యాంక్‌బండ్, 5 గంటలకు నెక్లెస్‌రోడ్‌లోను సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు.
తాగి ఇలా చిక్కారు..
ఇయర్ ఎండ్ నైట్ సిటీలో మహిళలతో సహా 957 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కారు. ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ ఉల్లం«ఘనకు సంబంధించి 27, ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు సంబంధించి 16, ఓవర్ స్పీడింగ్‌పై 31, ట్రిబుల్ రైడింగ్ 37 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ చీఫ్ జితేందర్ తెలిపారు. మొత్తమ్మీద 2016లో 17,051 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయగా.. వీరిలో 7,505 మందికి జైలు శిక్ష పడిందని, ‘నిషా’చరుల నుంచి రూ.3.15 కోట్లు జరిమానాగా వసూలైందని చెప్పారు. గత ఏడాది చిక్కిన వారిలో 13 మంది మహిళలు సైతం ఉన్నారని ఆయన తెలిపారు.
కేక్ కట్ చేసిన కొత్వాల్..
సిటీ పోలీసు విభాగం తరఫున నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం అర్ధరాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేట్ కట్ చేశారు. ఏటా మాదిరిగానే హుస్సేన్‌సాగర్ సమీపంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ట్రాఫిక్ చీఫ్ జితేందర్, డీసీపీలు ఏవీ రంగనాథ్, చౌహాన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సిబ్బంది విధులకు పునరంకితమై ప్రజల మన్నన పొందాలని పిలుపునిచ్చారు. వేడుకల ప్రశాంతంగా పూర్తి కావడం వెనుక సమిష్టి కృషి ఉందని ఆయన ఆదివారం పేర్కొన్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజల సహకారం సైతం ఎంతో ఉందని ఆయన కొనియాడారు. 100 షీ–టీమ్స్‌తో పాటు మరో 50 ట్రాఫిక్ పోలీసు బృందాలు నిరంతరాయంగా విధులు నిర్వర్తించాయని తెలిపారు.