నగరంలో ఓ రాత్రి నడిచిందిలా.. | night walkers at charminor area special story on ramzan | Sakshi
Sakshi News home page

నగరంలో ఓ రాత్రి నడిచిందిలా..

Published Sun, Jul 3 2016 2:56 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

నగరంలో ఓ రాత్రి నడిచిందిలా..

నగరంలో ఓ రాత్రి నడిచిందిలా..

ఇది వ్యాపారం చేసే బాజారు కాదు ఆప్తులు తప్పిపోయే ‘మేళా’ కాదు అత్తరు చల్లుకొనే కమ్మని ఆలింగనం ‘బతాసులు’ దొరికే స్వప్నలోకం హైద్రాబాదంటే రాఖీలు పేర్చిన దీపాల షామియాన - రాజా హైదరాబాదీ

వీధి దీపాల వెలుగులో మాత్రమే చూడగలిగే విచిత్రాలు.. పగటిపూట రద్దీకి పూర్తి విరుద్ధంగా అరకొర వాహనాలతో రహదారులు.. ఫ్లాస్క్‌లో టీ, కాఫీ, డబ్బాలో సిగరెట్ ప్యాకెట్లు రోడ్లకు వారగా పెట్టుకొని విక్రయించే చిరు వ్యాపారులు.. చీకటి వెలుగుల మాటున రాత్రిని ఎంజాయ్ చేస్తూ సిటీలో సంచరించే నైట్ లవర్స్..  గతంలోనూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి అభిరుచి కలిగిన వారంతా గ్రూపులు కట్టారు. ‘నైట్ వాక్స్’ పేరుతో బృందాలుగా నగర సంచారం చేస్తున్నారు. రంజాన్ పండుగ సంబరాల నేపథ్యంలో వీరి ‘వాక్స్’ మరింత ‘పీక్స్’కి చేరాయి.  - ఓ మధు

వాక్.. సాగేదిలా..
హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో ఎప్పుడూ సందడే ఉంటుంది. రంజాన్ సమయంలో ఈ సందడి పదింతలవుతుంది. రాత్రులు కూడా పగళ్లను మరిపిస్తూ సందర్శకుల తాకిడితో ఆ పరిసరాలన్నీ కలర్‌ఫుల్‌గా మారుతాయి. అందుకే ఇప్పుడు నగరంలోని నైట్ వాకర్స్ అంతా అదే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా సమాచారం అందించుకుంటూ బృందాలుగా నైట్ వాక్‌లు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పాతబస్తీలో వీరి సందడి ఊపందుకుంది.

స్థానికంగా నయాబ్ హోటల్ దగ్గర మొదలుకొని కనీసం 2 కి.మీ దూరంలో చార్మినార్ పరిసరాల్లోని హైలైట్స్ అన్నీ టచ్ చేస్తారు. పాతబస్తీ ప్రత్యేకతలు, ఆర్ట్, క్రాఫ్ట్ విషయాల్ని మాట్లాడుకుంటూ గల్లీగల్లీ చుట్టేస్తారు. చార్మినార్, మక్కా మసీదుల చరిత్ర పంచుకుంటారు. కాస్త సమయం చిక్కితే సిటీ కల్చర్ గురించి స్థానికులతో పిచ్చాపాటీ జరుపుతారు. ఇరానీ ఛాయ్ తాగి చార్మినార్ సందుల్లో తిరిగి.. హలీం రుచుల్ని ఆస్వాదిస్తారు. లాడ్‌బజార్, మదీనా షాపుల్లో తిరుగుతూ షాపింగ్ చేస్తారు.

చీకటి నడకల వెలుగులెన్నో..
వేర్వేరు ప్రాంతాల నుంచి నగరానికి కొత్తగా వచ్చిన వారిని ఈ నైట్ వాక్ ఈవెంట్‌లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సిటీ కల్చర్, పండుగ స్పెషల్స్ అన్నీ ఈ వాక్ అండ్ టాక్‌లో భాగమయ్యాయి. ఉదాహరణకు ఈ టైమ్‌లో రంగుల్లో వెలిగిపోయే చార్మినార్, దాని చుట్టూ అంతకన్నా కలర్‌ఫుల్‌గా సాగే రంజాన్ నైట్ బజార్.. గాజుల మెరుపులు, ఇరానీ ఛాయ్ ఘుమఘుమలు, హలీం రుచులు, దాని విశిష్టత.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలన్నీ ఒక్క పూటలోనే అవగతమయ్యేందుకు వీరికి అవకాశం లభిస్తోంది. పని తప్ప మరో ప్రపంచం తెలియని నగర ఉద్యోగులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి.

ఇక నగర సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు సందర్భానుసారంగా నైట్ వాక్‌లు నిర్వహిస్తూ పండుగలు, ఈవెంట్ల ప్రత్యేకతలు తెలియజేస్తున్న ‘హైదరాబాద్ ట్రెయిల్స్’ సంస్థ లాంటివి కూడా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా ఈ సంస్థ ఈ నెలలో ఐదు సార్లు వాక్ నిర్వహించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వీకెండ్‌లో 20-25 మంది గ్రూపుగా వెళ్లి సిటీ హెరిటేజ్‌కి షోకేస్ లాంటి ప్రదేశాల్ని విజిట్ చేస్తున్నారు. వందల ఏళ్ల నాటి నగర చారిత్రక వైభవాన్ని ఆస్వాదిస్తూ సాగుతున్నాయి ఈ నైట్‌వాక్స్. సిటీ కల్చర్‌కి కేరాఫ్‌గా నిలిచే చార్మినార్ ప్రాంతంలో వాక్ పూర్తయిన తర్వాత ఓ చక్కని ఫీలింగ్‌తో ఇళ్లకు చేరుతున్నారు వాకర్స్.

మంచి అవకాశం..
ఈ వాక్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమై 12:30 వరకు కొనసాగుతుంది. చార్మినార్ దగ్గర నైట్ వాక్  అంటే కేవలం ఒక పండుగ గురించి తెలిపేదే కాదు.. హైదరాబాద్ చరిత్ర, వైభవాన్ని తట్టి చూపే ఒక చక్కటి అవకాశం. - గోపాల కృష్ణ, హైదరాబాద్ ట్రెయిల్స్

ఎంజాయ్ చేశా..
పగటి పూట జరిగే జాతరలు, మార్కెట్లు ఎన్నో చూశాం. నైట్ వాక్స్‌లోనూ పాల్గొన్నాం. కానీ ఫెస్టివ్ మూడ్‌తో ఉండే నైట్ బజార్‌ని సందర్శించడం ఇదే తొలిసారి. బాగా ఎంజాయ్ చేశాను.  -స్వాతి,ఐటీ ఉద్యోగి,బెంగళూర్

ఇల్లు గుర్తుకు రాదు..
నైట్ వాక్స్ వెరైటీ ఎక్స్‌పీరియన్స్. రాత్రి పూట దొరికేవి తినడం ఇంట్రెస్టింగ్. నాన్‌వెజ్ మాత్రమే కాదు..  దోసెలు, స్వీట్లు, సమోసాలకు సైతం లోటుండదు. కళ్లు, కాళ్లు అలిసిపోయి.. కడుపు ఆయాస పడుతుంటే గానీ ఇళ్లకు వెళ్లాల్సిన సమయమైందని గుర్తు రాదు.
- రాజేశ్, టూరిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement