నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది అదృశ్యమయ్యారు. వీరులో ఒక బధిరుడు, ఒక బాలుడు, బాలిక, ముగ్గురు విద్యార్థినులు, ఒక మహిళ, ఒక యువతి, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరి కోసం అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వేస్టేషన్‌లో బధిరుడు...
సికింద్రాబాద్: రైల్వేస్టేషన్‌లో ఓ బధిరుడు అదృశ్యమయ్యాడు. గోపాలపురం హెడ్‌కానిస్టేబుల్ ఎస్.శ్రీరాములు కథనం ప్రకారం....విశాఖపట్నం అలీపురానికి చెందిన యు.భాస్కరరావు నగరంలోని బొగ్గులకుంటలో అమ్మ, అక్కతో కలిసి ఉంటున్నాడు. తనకు రావాల్సిన వికలాంగ పింఛన్‌ను తెచ్చుకొనేందుకు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన భాస్కరరావు ఈనెల 21న నగరానికి రైల్లో తిరిగి బయలుదేరాడు.
అతని రాకకోసం సోదరి కృష్ణవేణి నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఎదురు చూసింది. అయితే అతను రాకపోవడంతో రైల్వే పోలీసులను ఆశ్రయించి నాంపల్లి, సికింద్రాబాద్‌స్టేషన్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. అతను సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి బయటకు వెళ్లినట్టు కనిపించింది. దీంతో సోదరి గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీతాఫల్‌మండిలో బాలుడు...
చిలకలగూడ : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ జయశంకర్ కథనం ప్రకారం.. సీతాఫల్‌మండి టీఆర్‌టీ క్వార్టర్స్‌కు చెందిన దీపక్(11) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 23న సాయంత్రం స్నేహితులతో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తండ్రి కిశోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నారపల్లిలో బీటెక్ విద్యార్థిని...
బోడుప్పల్: బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ కిషన్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన హనుమంత్‌రెడ్డి కుమార్తె సుమలత(23) నారపల్లి దివ్యనగర్‌లోని హాస్టల్ ఉంటూ నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ వెళ్తున్నానని హాస్టల్‌లో చెప్పి బయలుదేరిన సుమలత ఇంటికి చేరలేదు. దీంతో ఆమె తండ్రి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల విద్యార్థిని...
బోడుప్పల్: పుస్తకాలు తెచ్చుకొనేందుకు స్కూల్‌కు వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. ఆదివారం మేడిపల్లి ఎస్‌ఐ వెంకటయ్య కథనం ప్రకారం... బోడుప్పల్ రెడ్డీస్ కాలనీకి చెందిన గోపాల్ బహుదూర్ కుమార్తె అనిత బహుదూర్(14) ఇందిరానగర్‌లోని న్యూటన్ గ్రామార్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. శనివారం స్కూల్‌కు వెళ్లిన అనిత తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి గోపాల్ బహుదూర్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
హాల్‌టికెట్ కోసం వెళ్లిన విద్యార్థిని...
దుండిగల్: కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కూతురు సుజాత(17) మేడ్చల్‌లోని స్ఫూర్తి కళాశాలలో చదువుతోంది. కాగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హాల్ టికెట్ తెచ్చుకునేందుకు కళాశాలకు వెళ్లిన సుజాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
లక్ష్మీగూడలో బాలిక...
కాటేదాన్: బాలిక అదృశ్యమైన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మహేంద్రనాథ్ కథనం ప్రకారం...లక్ష్మీగూడ రాజీవ్‌గృహకల్ప ప్రాతానికి చెందిన మహ్మద్ అజ్మతుల్లా కూతురు మున్నిబేగం(16) ఈనెల 21న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వెతికినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదుచేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
అడ్డగుట్టలో మహిళ...
అడ్డగుట్ట: పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. తుకారాంగేట్ పోలీసుల కథనం ప్రకాం... అడ్డగుట్ట ఆజాద్‌చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన సీహెచ్ రమేష్, స్వరూప(23) దంపతులు. రమేష్ ఆటోడ్రైవర్ కాగా, స్వరూప మహేంద్రాహిల్స్‌లోని రోడ్డు నెం. 6లోని ఓ ఇంట్లో పని చేస్తోంది. అయితే, రోజూ మాదిరిగానే ఈనెల 11న పనికి వెళ్లిన స్వరూప రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. భర్త ఆమె కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో ఆదివారం తుకారాంగేట్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాదాపూర్‌లో యువతి..
చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ అక్రంబాబా కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని అంజనీనగర్‌కు చెందిన బి.కవిత (16) ఈనెల 23న ఉదయం ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రాజు ఆదివారం మాదాపూర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-గచ్చిబౌలి
నేపాల్‌కు చెందిన వృద్ధుడు...
నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు కూతురు వద్దకు వచ్చి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రంజిత్ కథనం ప్రకారం.. గీత్ బహదూర్ (60) నేపాల్ నుంచి కూతురు వద్దకు వచ్చాడు. ఈనెల 22న ఉదయం 6 గంటలకు టీ తాగేందుకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో అల్లుడు రాంబహదూర్ మాదాపూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు.
-గచ్చిబౌలి
తొమ్మిది మంది అదృశ్యం
Published Mon, May 25 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement