మంత్రివర్గం, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడంపై ఎలాంటి పోరాటం చేయకూడదని రాష్ట్ర మంత్రివర్గం, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయించాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయకూడదని, మన పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాల్సిందిగా వినతులు, లేఖల ద్వారా కోరాలని నిర్ణయించాయి. టీడీపీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావేశాలు సోమవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగాయి. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంట్‌లో తాజాగా కేంద్ర మంత్రి హెచ్‌పీ చౌదరి చేసిన ప్రకటనపై చర్చ జరి గింది.
కేంద్రం చేసిన ప్రకటన వల్ల తాము ప్రజ ల్లోకి వెళ్లలేకపోతున్నామని, విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రులు, నేతలు వివరించారు. చంద్ర బాబు మాత్రం వారి ఆవేదనను సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుత పరి స్థితుల్లో కేంద్రంతో ఏ అంశంలోనూ పోరాటం చేయలేమని, మంత్రివర్గం నుంచి మన వారిని ఉపసంహరించుకోలేమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఆర్థిక సాయంపై ఇప్పటికే పలుమార్లు కేం ద్రానికి వినతులు సమర్పించామని, అవసరమైతే మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తామని చెప్పారు. కాగా, ఈసారి మహానాడును తిరుపతిలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని సరి చేయాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం మంగళవారం గుంటూ రు జిల్లాలోని సీఎం నివాసంలో జరగనుంది.