- ఉమ్మడి రాష్ట్రంలో సిండికేట్ వ్యవహారం
- తెలంగాణలోని 300 మంది ఎక్సైజ్ అధికారులకు లభించని విముక్తి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం లో వెలుగు చూసిన మద్యం సిండికేట్ల వ్యవహారం నుంచి ఆబ్కారీ శాఖ అధికారులకు విముక్తి లభించడం లేదు. 2012లో ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మద్యం దుకాణాల సిండికేట్ల వ్యవహారం వెలుగు చూసింది. వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సిండికేట్‌గా ఏర్పాటై అధిక ధరలకు జిల్లాల్లో మద్యం విక్రయాలు సాగించారని అప్పట్లో ఆరోపణలు రాష్ట్రాన్ని వేడెక్కించాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యాపారులు, నాయకులు, అధికారులపై పోలీసు శాఖ కేసులు నమోదు చేసింది. తెలంగాణ వచ్చాక ఈ కేసుల నుంచి విముక్తి పొందుతామని భావించిన అధికారులకు నిరాశే ఎదురైంది. న్యాయం చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా నేటికీ చర్యలు చేపట్టలేదు.
80 శాతం మందిపై కేసులు...
ఈ వ్యవహారంలో వ్యాపారులు, ఇతరులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని సీఐ, ఆపై స్థాయి గల 1100 మంది అధికారుల్లో 800 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన 300 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరిలో 120 మందిపై ట్రిబ్యునల్ ఫర్ డిపార్ట్‌మెంటల్ ప్రాసిక్యూషన్ (టీడీపీ) కింద, 50 మందిపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైయిరీస్ కింద కేసులు నమోదయ్యాయి. 10 మందిపై డిపార్ట్‌మెంటల్ విచారణ జరిగింది. మరికొందరిపై విచారణ స్థాయిలో ఉన్నాయి. ఈ కేసుల గురించి పట్టించుకునే నాథుడు లేక అధికారులు సర్వీస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2013 నుంచి పదవీ విరమణ పొందిన 54 మంది తెలంగాణ అధికారుల్లో ఏసీబీ కేసుల్లో ఉన్నవారు 40కి పైగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వీరందరికీ పదవీ విరమణ ప్రయోజనాలు గానీ, పింఛను గానీ రాలేదు. కాగా, రాష్ట్రంలో పని చేసిన ఎక్సైజ్ అధికారుల్లో 80 శాతం మంది మీద ఏసీబీ కేసులున్నాయని, వాటిని పునఃపరిశీలించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తప్పుడు కేసులు తొలగిస్తామని ఆబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ జనవరిలో అధికారులకు హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
వదలని ఏసీబీ కేసులు
Published Mon, Apr 4 2016 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM
Advertisement
Advertisement