సర్వేలేమీ చేయలేదు
ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్
- వైఎస్సార్‌సీపీ నేతలతో పరిచయ కార్యక్రమం
- తమ కార్యకలాపాల గురించి వివరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై తమ కార్యకలాపాలను త్వరలో మొదలు పెడతామని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఆయన బుధవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా అధ్యక్షుల, జిల్లా పరిశీలకుల సమావేశంలో మాట్లాడారు.
ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో పెట్టబోతున్న తీర్మానాలపై చర్చించడం కోసం ఏర్పాటైన ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్‌ను జగన్ ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షులను, నేతలను పరిచయం చేశారు. ఏఏ అంశాలపై ఆయన పార్టీకి సహకారం అందజేస్తారో నేతలకు వివరించారు. పార్టీని సంస్థాగతంగా శాస్త్రీయంగా విశ్లేషించి మరింత పటిష్టతకు ఆయన సేవలను తీసుకుంటున్నామని అందులోని ఉద్దేశాలను జగన్ వెల్లడించారు.

ఎలాంటి సర్వేలూ చేయలేదు..
తాము రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి అధ్యయనాలు చేయలేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే మీ బృందం సర్వేలు జరిగినట్లుగా, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం జరుగుతోంది కదా?’ అని ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రస్తావించగా... ‘అవును... ఇలాంటి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. అదంతా బోగస్, మేం ఎలాంటి సర్వే చేయలేదు. మేమింకా పని మొదలు పెట్టనేలేదు. మా బృందంతో ఇపుడిపుడే కార్యక్షేత్రంలోకి దిగు తున్నాం. అయినా ప్రాథమికంగా మా ప్రవృత్తి సర్వేలు చేయడం కానే కాదు. అవసరమని భావించినపుడు సర్వేలు చేస్తాం తప్ప అదే ప్రధానం కాదు’ అని ఆయన సమాధానమిచ్చారు.
పార్టీ పరిస్థితి, పనితీరు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకుని అంచనా వేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ నేతలతో కార్యకలా పాలను సమన్వయం చేసేందుకు తమకు సంబంధించి ఓ బృందం పని చేస్తూ ఉంటుందని, అలాగే జిల్లాల్లో కూడా కొన్ని బృందాలు ఉండబోతాయని వివరించారు. తమ బృందం సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు, పరిశీలకులతో సంబంధాలు కలిగి ఉంటాయన్నారు. ఎక్కడైనా, ఏవైనా చిన్న లోపాలు ఉంటే పార్టీ నేతల దృష్టికి తమ బృంద సభ్యులు తెస్తుంటారని, వాటిని సవరించుకోవాలన్నారు. తమ కార్యకలాపాలు ఎలా ఉండబోతాయో వివరించారు. సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బా రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృ ష్ణారెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, 13 జిల్లాల అధ్యక్షులు పరిశీలకులు పాల్గొన్నారు.
స్థానిక అంశాలపైనా తీర్మానాలు: కాకాణి
పార్టీ ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర స్థాయి అంశాలే కాక ఆయా జిల్లాల్లో స్థాని కంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న, ఇబ్బందిగా పరిణమిస్తున్న సమస్యలపై కూడా తీర్మానాలు చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్య క్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.
