నిరాశే!
అందుబాటులోకి రాని ఓటర్ల జాబితా
అమలుకు నోచని ప్రకటనలు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ప్రకటనలకు... కార్యాచరణకూ మధ్య ఎంతో తేడా ఉంటోంది. డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల వెల్లడిలో జాప్యమే దీనికి నిదర్శనం. ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల (డివిజన్ల) వారీగా మంగళవారం అన్ని సర్కిల్, ఆర్డీఓ, తహసీల్దారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ చాలా సర్కిళ్లలో రాత్రి వరకూ ఇవి అందుబాటులోకి రాలేదు. కొన్ని చోట్ల జాబితాల కాగితాల కట్టల (రోల్స్)ను ఉంచి వెళ్లారు. అధికారులను సంప్రదిస్తే ఇంకా జాబితాలు రూపొందుతున్నాయన్న సమాధానమే తప్ప వివరాలు వెల్లడి కాలేదు. అంతేకాకుండా వివరాలు సైతం అరకొరగా... అస్తవ్యస్తంగా ఉండటంతో రాజకీయ పార్టీలు, పరిశీలకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు ప్రధాన కార్యాలయ వర్గాలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. సర్కిళ్లలో అందుబాటులో ఉన్న వివరాలు ప్రధాన కార్యాలయంలో లేకపోవడం విస్తుగొల్పుతోంది. ప్రధాన కార్యాలయం నుంచి ఆమోదం లభించాకే సర్కిళ్లలో ప్రకటించడం ఆనవాయితీ కాగా... సర్కిల్ స్థాయిలోనే చివరిసారి పరిశీలించి ప్రకటిస్తున్నారని చెబుతున్నారు.
భారీగా ద రఖాస్తులు
దాదాపు నెలన్నర రోజుల్లో ఓటరు జాబితాలో పేరు కోసం 1.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 4 వరకు జీహెచ్‌ఎంసీలోని ఓటర్లు 80,57,198 మంది కాగా... అక్టోబర్ 5 నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు 1,34,175 మంది. వీరిలో 28,370 దరఖాస్తులను ఆమోదించారు. 1,959 తిరస్కరించారు. మరో 1,03,846 పెండింగ్‌లో ఉన్నాయి. జాబితా నుంచి తొలగింపు కోసం 710 ఫిర్యాదులు రాగా... వాటిల్లో 70 తిరస్కరించారు. మిగతా 640 పెండింగ్‌లో ఉన్నాయి. పేర్లు, ఇతరత్రా పొరపాట్లు సవరించాల్సిందిగా 24,447 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 8529 ఆమోదించారు. 3111 తిరస్కరించారు. 12,807 పెండింగ్‌లో ఉన్నాయి. చిరునామా మార్పుల కోసం 4,889 దరఖాస్తులు వస్తే.. 757 ఆమోదించారు. 453 తిరస్కరించారు. 3679 పెండింగ్‌లో ఉన్నాయి.
ఉప్పల్ నుంచి ఎక్కువ అభ్యర్థనలు
ఓటర్లుగా నమోదు కోసం ఉప్పల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 12,445 దరఖాస్తులు అందగా... ఆ తర్వాతి స్థానంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉంది. అక్కడి నుంచి 11,029 దరఖాస్తులు అందాయి. చిరునామా మార్పులకు అత్యధికంగా రాజేంద్రనగర్ నుంచి 616 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాతి స్థానంలో మల్కాజిగిరి (516) ఉంది.
పెరిగిన ఓటర్లు...
కొన్ని సర్కిళ్ల నుంచి మంగళవారం రాత్రి పొద్దుపోయాక అందిన సమాచారం మేరకు వివిధ డివిజన్లలోని ఓటర్లు గతంలో కంటే భారీగా పెరిగారు. గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో గతంలో దాదాపు 32 వేల ఓటర్లు ఉండగా... తాజా జాబితా మేరకు వీరి సంఖ్య 51,553కు పెరిగింది. జాంబాగ్‌లో గతంలో 38 వేల ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 59,293కు పెరిగారు.