
ఎర్రబెల్లి బృందం విలీనం చెల్లదు
► దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం: రేవంత్‌రెడ్డి
► ఎమ్మెల్యేలందరూ పార్టీ మారితేనే విలీనమని వ్యాఖ్య
► టీడీఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి
► పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌కు ఇచ్చిన లేఖ చెల్లదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా సమావేశమై తీర్మానం చేసి.. పార్టీని మొత్తంగా విలీనం చేయాలని, శాసన సభాపక్షం ఒక్కటే కాదని చెప్పారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ఎర్రబెల్లి స్థానంలో టీడీఎల్పీ నేతగా నియమితుడైన రేవంత్‌రెడ్డి... శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిశారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, వివేకానంద, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్ అందజేశారు. అనంతరం టీడీఎల్పీ కార్యాలయానికి చేరుకుని శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని చెప్పారు.
బాబుతో భేటీ..
అసెంబ్లీ కార్యదర్శిని కలవడానికి ముందు టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమై... అసెంబ్లీ స్పీకర్‌కు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన లేఖపై చర్చించారు. శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తున్నట్లు దయాకర్‌రావు లేఖ ఇవ్వడంపై మండిపడ్డారు. పార్టీని విలీనం చేసే హక్కు, అర్హత కేవలం అధ్యక్షుడికే ఉంటుందని... ఫ్లోర్‌లీడర్‌కు కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్పీకర్‌ను కలసి తాజాగా పార్టీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ అందజేయాలని నిర్ణయించారు. స్పీక ర్ అందుబాటులో లేనందున అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రేవంత్‌తో పాటు మాగంటి గోపీనాథ్, గాంధీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్ తదితరులు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు.