ఎన్‌ఆర్‌ఐ మెడికల్ పీజీ ఫీజు 2.27 కోట్లు
- కన్వీనర్ కోటా సీటుకు రూ.6.90 లక్షలు
- ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల ఫీజులకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అచ్చంగా అదేవిధంగా ఫీజులు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫీజులనే ఖరారు చేస్తామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఏపీ ప్రభుత్వం యాజమాన్య కోటాతో పాటు ఇటు కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను కూడా భారీగా పెంచింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో క్లినికల్ కన్వీనర్ కోటా సీటుకు రూ. 3.2 లక్షల ఫీజుండగా, దాన్ని రూ. 6.90 లక్షలకు పెంచుతారు. ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్లకు రూ. 5.80 లక్షలున్న సంగతి తెలిసిందే. దాన్ని రూ. 24.20 లక్షలు చేయనున్నారు. 25 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల కేటగిరీని కొత్తగా సృష్టించనున్నారు. ఆ ఎన్‌ఆర్‌ఐ సీట్ల ఫీజు యాజమాన్య కోటా సీటుకు వసూలు చేసే సొమ్ముపై మూడు రెట్లు మించకుండా వసూలు చేసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ. 72.60 లక్షల వరకు, మూడేళ్లకు కలిపి రూ. 2.27 కోట్లు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది.