పాతబస్తీలోని రైల్వేస్టేషన్లు పోకిరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పాతబస్తీ పరిధిలో మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌తోపాటు డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పు గూడ, ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లున్నాయి.
చార్మినార్ (హైదరాబాద్) : పాతబస్తీలోని రైల్వేస్టేషన్లు పోకిరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పాతబస్తీ పరిధిలో మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌తోపాటు డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పు గూడ, ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లున్నాయి. వీటిలో కొన్నింటిని అసాంఘిక శక్తులు తమ అడ్డాలుగా మార్చుకుంటుండగా.. అల్లర చిల్లరగా తిరిగే జులాయిలు మరికొన్నింటిని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. మహిళలు ఒంటరిగా రైల్వే స్టేషన్లకు వెళ్లడానికి జంకుతున్నారు. డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా ప్లాట్ ఫారంలకు సమీపంలో కొద్దిదూరం వరకు చెట్ల పొదలు నిండి ఉండడంతో వీటిని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
వైట్నర్ల బెడద...
పాతబస్తీ రైల్వే స్టేషన్లలో వైట్నర్‌ల బెడద ఎక్కువైంది. ఇంక్ ఎరేసర్ (వైట్నర్)ను మత్తు మందుగా వాడే చిన్నారులు, యువకులు రైల్వే స్టేషన్లలో తిష్ట వేసి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లల్లో పనికి వెళుతున్నమంటూ చెబుతూ బయటికొచ్చే వైట్నర్‌లు రోజంతా మత్తులో జోగుతుంటారు. వైట్నర్ మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జేబులు కత్తిరిస్తూ జల్సా చేస్తున్నారు. అడ్డుకుంటే దాడులకు పాల్పడుతున్నారు. రైల్వే స్టేషన్లలో వీరి ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఉందని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. వైట్నర్ల బెడద ఎక్కువ కావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
రైల్వే ప్రమాదాలంటూ హత్యలు...
హత్యలు చేసి రైల్వే ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలున్నాయి. పాతకక్షలు, దాడులు, హత్యలు చేసిన అనంతరం దుండగులు రైల్వే ట్రాక్‌లను వాడుకుంటున్నారు. ఎక్కడో హత్యలు చేసి పాతబస్తీ రైల్వే ట్రాక్‌లపై పడేసి పారిపోతున్నారు. ఆయా హత్య కేసుల నుంచి తప్పించు కునేందుకు హంతకులు వీటిని వినియోగించుకుంటున్నారు. హత్యలు చేసి రైల్వే ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్న సంఘటనలున్నాయి. గతంలో ఎన్నో మృతదేహాలు పాతబస్తీ రైల్వే స్టేషన్లకు సమీపంలోని చెట్ల పొదల్లో లభించిన సంఘటనలున్నాయి.
యధేచ్ఛగా గుడుంబా రవాణా...
పాతబస్తీలోని రైల్వే స్టేషన్లలో స్థానిక పోలీసుల నిఘా కరువవడంతో గుడుంబా రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. రైల్వే పోలీసుల తనిఖీలు లేకపోవడంతో అక్రమ గుడుంబా రవాణాకు పాతబస్తీ రైల్వే స్టేషన్లు అనుకూలంగా మారాయి. రైల్వే, సివిల్ పోలీసులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని... ఆపై పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.