
ఓల్డ్.. గోల్డే..
లేటు వయసులో లేటెస్టు జాబ్
- అరవై దాటినా.. రెస్ట్‌కు నో చెబుతున్న సీనియర్ సిటిజన్స్
- యువతకు పోటాపోటీగా ఉద్యోగాల వేట
- గ్రేటర్ హైదరాబాద్‌లో నయా ట్రెండ్
మొదటిసారి ఉద్యోగంలో చేరడం ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే.. రెండోసారి ఉద్యోగంలో చేరడం.. అది కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత చేరడాన్ని సెకండ్ ఇన్నింగ్స్ అనాల్సిందే కదా. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నడుస్తున్న నయా ట్రెండ్ ఈ మాటలకు ఊతమిస్తోంది. పనిలోనే తమకు అంతులేని ఆనందం ఉందంటున్నారు గ్రేటర్‌లోని సీనియర్ సిటిజన్స్. అరవయ్యో వడిలోనూ క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమవడం ఎంతో సంతృప్తినిస్తోందని చాటి చెబుతున్నారు. ఇలాంటి వారికి ఉద్యోగాలు వెదికిపెట్టడానికి బోలెడన్ని వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య సుమారు 60 వేల మంది ఆయా సైట్లలో పేర్లు నమోదు చేసుకుని ఉద్యోగాల వేటలో యూత్‌కు తీసిపోమని సవాల్ విసురుతున్నారు.
– సాక్షి, హైదరాబాద్
భారం కాదు.. వరం..
దేశంలో ప్రస్తుతం 60 ఏళ్లకు మించి వయస్సున్నవారు సుమారు 10.3 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. వీరి సంఖ్య 2021 నాటికి 17 కోట్లకు చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుత తరుణంలో వైద్యపరీక్షలు, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రావడంతో సగటు జీవనకాలం 65 ఏళ్లకు పెరిగింది. దీంతో వయో వృద్ధులు పనిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్‌పై మక్కువతో పనిచేస్తున్నా..
రాష్ట్ర భవిష్యత్‌కు నా వంతుగా చేయూతనందించేందుకు పదవీ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నా. సమాజం కోసం పని చేయాలన్న ఆలోచనే నన్ను ముందుకు నడిపిస్తోంది. చదువుకునే రోజుల్లో విద్యార్థి నేతగా తెలంగాణ కోసం ఉద్యమించా. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్నా.
– డాక్టర్ కేవీ రమణాచారి,రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు.
మానసిక, శారీరక ఆరోగ్యం కోసమే..
శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేందుకే పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పనిచేస్తున్నా. నాకున్న అనుభవంతో కంపెనీ లాభాల బాటలో పయనించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నా. నిరంతరం పనిచేస్తుండడం ఆనందంగా ఉంది.
– ఆనంద్‌రెడ్డి,జలమండలి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్
ఎవరికీ భారం కాకూడదనే..
కొడుకు, కూతురుకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరా. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడం సంతృప్తినిస్తోంది.
– మల్లారెడ్డి, రిటైర్డ్ అకౌంట్స్ అధికారి, ఆర్టీసీ
పనిలోనే ఆనందం..
ఖాళీగా కూర్చుంటే మెదడు చెత్త ఆలోచనలకు నిలయంగా మారుతుందన్న ఫిలాసఫీని గ్రేటర్ సీనియర్ సిటిజన్లు వంటబట్టించుకున్నారు. దీంతో పదవీ విరమణ పొందిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటికి పరిమితమైపోకుండా.. వీలైతే పదవీ విరమణ పొందిన సంస్థలోనో.. లేదా మరోచోట తక్కువ వేతనానికైనా పని చేసేందుకు సై అంటున్నారు. వీరికి ఉద్యోగాలను వెదికిపెట్టేందుకు ‘నాట్ రిటైర్డ్.ఇన్’, మనీక్రాషర్స్.కామ్, న్యూరిటైర్మెంట్.కామ్, మాన్‌స్టర్.కామ్ తదితర సైట్లు ముందుకొస్తున్నాయి. ఒకసారి నిర్ణీత ఫీజు చెల్లించి నమోదు చేసుకుంటే.. ఉద్యోగం వచ్చేవరకు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇలాంటి వారు తమ అనుభవం, అర్హతలను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు పొందుతున్నారు.
30 శాతం మంది నో రి‘టైర్డ్’..
పదవీ విమరణ పొందినవారంతా ఇలా ఉద్యోగాల వేటలో ఉన్నారనుకుంటే పొరబాటే. 30 శాతం మంది ఉద్యోగాల అన్వేషణలో ఉంటే.. మరో 60 శాతం మంది సామాజిక సేవ, గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయం, కళారంగం తదితర వ్యాపకాల్లో కాలక్షేపం చేస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మరికొందరు ఆరోగ్య రీత్యా విశ్రాంతికి.. మరికొందరు మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తేలింది.
సెకండ్ ఇన్నింగ్స్.. ఎందుకంటే..
► పనిచేస్తూ ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందన్న నమ్మకం.
► కొడుకులు, కూతుళ్లకు భారం కాకుండా.. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మనస్తత్వం.
► కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పనిచేయాల్సి రావడం.
► విదేశాల్లో ఉంటున్న సంతానం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇమడలేకపోవడం.
► తమ అనుభవం, విజ్ఞానంతో అద్భుతాలు సృష్టించవచ్చన్న విశ్వాసం.
► పలువురికి స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నిలవాలనుకునే వ్యక్తిత్వం.