టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరో టీడీపీ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి తెలంగాణ మంత్రులతో భేటీ అయిన రాజేందర్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత శనివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్‌లో అధికారికంగా చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీకి ఉనికి లేదని, అందుకే ఆ పార్టీని వీడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
కాగా, శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ బుధవారమే కారు ఎక్కారు. అంతకుముందు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటికే తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా రాజేందర్‌రెడ్డి కూడా అధికార పార్టీ గూటికి చేరుతుండటంతో కారు ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరనుంది. రాజేందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 10కిపైగా మంది టీఆర్ఎస్‌లో చేరడంతో మూడింట రెండొంతుల మంది ఆ పార్టీలో చేరినట్టయింది. దీంతో టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనానికి మార్గం సుగమమైనట్టు భావిస్తున్నారు. దీంతో పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడబోదని భావిస్తున్నారు.
నిజానికి టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పార్టీ మారుతారని టాక్ రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించలేదు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్న అంతా భావించారు. ఇటీవల జరిగిన టీటీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్ మార్గంలోనే రాజేందర్‌రెడ్డి కూడా సైకిల్‌ను వీడి కారు ఎక్కుతుండటంతో టీడీపీకి మరో పెద్ద షాక్ తగిలినట్టయింది.