'ఆన్‌లైన్' కేటుగాళ్లు | online cheating | Sakshi
Sakshi News home page

'ఆన్‌లైన్' కేటుగాళ్లు

Published Mon, May 23 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

'ఆన్‌లైన్' కేటుగాళ్లు

'ఆన్‌లైన్' కేటుగాళ్లు

ఈ-కామర్స్ సైట్స్ వేదికగా చీటింగ్
జోరుగా నకిలీ వస్తువుల విక్రయాలు
బహుపరాక్ అంటున్న పోలీసు అధికారులు

 

సిటీబ్యూరో: నాసిరకం సెల్‌ఫోన్లు పట్టుకుని రహదారుల్లో సంచరించడం...‘అనువైన’ వారిని ఎంపిక చేసుకుని కష్టాల పేరుతో ఆకర్షించడం... సదరు ఫోన్ తక్కువ ధరకే విక్రయిస్తున్నానంటూ అందినకాడికి దండుకుని అంటగట్టడం... ఇలా నేరుగా జరిగే చీటింగ్స్ గతంలోనూ చూశాం. అయితే ప్రస్తుతం మోసగాళ్ల పంథా మారింది. ఆన్‌లైన్ వేదికగా పక్కా పథకం ప్రకారం మోసాలకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ ఫోన్ల ఫొటోలు పోస్ట్ చేసి, ఒరిజినల్ అంటూ టోకరా వేస్తున్న వాళ్లు కొందరైతే... ఆన్‌లైన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటామంటూ పట్టుకుని ఉడాయిస్తున్న వారు ఇంకొందరు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

 
రెండు రకాలుగా ఈ-కామర్స్ సైట్లు...

ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపే ఈ-కామర్స్ వెబ్‌సైట్లు రెండు రకాలైనవి అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు, సంస్థలకు చెందిన ఉత్పత్తులకు ప్రచారం కల్పిండంతో పాటు తమ వెబ్‌సైట్ ద్వారా అమ్ముకునే అకాశం ఇచ్చేవి మొదటి రకం. ఇలా చేసినందు వల్ల లావాదేవీల్లో వీటికి కొంత కమీషన్ ముడుతుంది. ఇక రెండో రకానికి చెందిన ఈ-కామర్స్ సైట్లు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇవి సెకండ్ హ్యాండ్ వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారులే తాము వినియోగిస్తున్న వస్తువుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో పోస్ట్ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించడం ద్వారా ఖరీదు చేసుకునే అవకాశం ఉంది.

 
‘పోస్టింగ్’ ఎంతో ఈజీ...

మొదటి తరహా వెబ్‌సైట్ల వల్ల అంతగా నష్టం లేకపోయినా...రెండో రకానికి చెందిన వాటితోనే తలనొప్పులు వస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. వీటిలో తాము వినియోగిస్తున్న వస్తువుల్ని విక్రయించాలని ఆశించే వినియోగదారులు ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి, ఆయా వెబ్‌సైట్లకు చెందిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫోన్‌లో వినియోగించే సిమ్‌కార్డు బోగస్ వివరాలతో తీసుకున్నదైతే వీరి ఉనికి బయటపడటం కూడా   కష్టసాధ్యమే. ఇలాంటి వెబ్‌సైట్లను వేదికగా చేసుకున్న మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు.


చీటింగ్స్ ఎన్నో రకాలు...
ఈ వెబ్‌సైట్లను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే చీటర్లు ప్రధానంగా రెండు ‘మార్గాలను’ అనుసరిస్తున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువుల్ని పోలి ఉండే, అదే కంపెనీ పేర్లతో లభించే వస్తువుల్ని మోసగాళ్లు ఖరీదు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రోనగరాల మార్కెట్లలో ఇవి అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి. అలా తీసుకువచ్చిన వాటిని అసలువంటూ ‘సెకండ్ హ్యాండ్’ వెబ్‌సైట్స్‌లో పోస్టు చేసి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ఖరీ దు చేస్తామంటూ వాటి యజమానుల్ని సం ప్రదిస్తున్న మోసగాళ్లు ట్రయల్ అని, డబ్బు తీసుకువస్తామని, దృష్టి మళ్లించి వాటిని ఎత్తుకుపోతున్నారు. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయి.

 
దొంగ ఫోన్లూ అమ్మేస్తున్నారు...

ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ చోరీలు పెరిగిపోయాయి. వ్యక్తుల నుంచి దుకాణాల్లోనూ తస్కరణకు గురవుతున్న వాటిలో 50 శాతం కూడా రికవరీ కావట్లేదు. ఇలాంటి చోరీ ఫోన్లు కూడా ‘క్లోనింగ్’ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయానికి వస్తున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. చోరీ ఫోన్లకు చోరుల నుంచి తక్కువ ధరకు ఖరీదు చేస్తున్న వ్యవస్థీకృత ముఠాలు కొన్ని సాఫ్ట్‌వేర్స్ వినియోగించి వాటి ఐఎంఈఐ నెంబర్లను క్లోనింగ్ చేస్తున్నాయి. ఆపై ఈ ఫోన్లకు కొన్ని తుదిమెరుగులు అద్ది దర్జాగా ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. క్లోనింగ్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ మారిపోతే ఇక ఆ చోరీ ఫోన్‌ను సాంకేతికంగానూ గుర్తించడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఇలాంటి దం దాలు వ్యవస్థీకృతంగా చేసే ముఠాలు ఉత్తరాదిలో అనేకం ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.


ఇటీవలే ఇద్దరిని అరెస్టు చేశాం
‘ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఇటీవలే అరెస్టు చేశాం. మియాపూర్‌లో నివసిస్తున్న దవులూరి నరేంద్ర ప్రముఖ కంపెనీల ఫోన్లను పోలిన నకిలీవి వెబ్‌సైట్‌లో పెట్టి విక్రయిస్తూ చిక్కాడు. కుత్భుల్లాపూర్‌కు చెందిన కార్తికేయ ఆన్‌లైన్‌లో ఉన్న ఫోన్లు కొంటానంటూ విక్రేతల్ని సంప్రదిస్తూ అదును చూసుకుని వాటితో ఉడాయిస్తూ పట్టుబడ్డాడు. ఇలాంటి మోసగాళ్లు ఇం కా అనేక మంది ఉంటారు. ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు చేసే వాళ్లు జాగ్రత్తగా ఉం డాలి. అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నగదు చెల్లింపులు చేయడం, వస్తువులు అప్పగించడం తప్పనిసరి. అలా కాకుండా మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా అమ్ముతున్న వ్యక్తి వివరాలు, వస్తువు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఎలాంటి పరిశీలన లేకుండా ముందుకు వెళ్తే మోసపోవాల్సి ఉంటుంది.’

 -ఎ.వెంకటేశ్వర్‌రావు, వెస్ట్‌జోన్ డీసీపీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement