
అదిరేట్టు.. ఆన్ లైన్ కుట్టు
మహిళలు డ్రెస్‌లు, బ్లౌజ్‌లు తదితరాలకు తొలుత ఫ్యాబ్రిక్ కోసం షాపింగ్ చేయాలి. ఆ తర్వాత చక్కగా కుట్టిచ్చే టైలర్ కోసం అన్వేషించాలి. టైలర్ దొరికాక అతను చెప్పిన వ్యవధి వరకూ ఆగి, అప్పుడు వెళ్లి చార్జీలు చెల్లించి దుస్తులు తెచ్చుకోవాలి. ఇదంతా చెప్పడానికి తేలిగ్గా ఉన్నా.. చేయడం కాస్త ఇబ్బందే. ఆధునిక బిజీ మహిళలకు ఇది మరింత ఒత్తిడి పెంచే పనే. అయితే అనంతకోటి సమస్యలకు ఆన్‌లైనే సమాధానమన్నట్టుగా మారిపోతున్న క్రమంలో.. ఇప్పుడు ఆన్‌లైన్ టైలర్స్ వచ్చేశారు. - సిద్ధాంతి
‘మన భారతీయ టైలరింగ్ పరిశ్రమలో ప్రొఫెషనల్స్ కాని స్థానిక టైలర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో మహిళలకు కచ్చితమైన ఫిట్‌కి సంబంధించి తమ దుస్తులు చేతికి వచ్చే వరకూ సందేహాలు, ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రోజువారీ పని ఒత్తిడి కారణంగా దుస్తులు కొని, దూరంగా ఎక్కడో ఉన్న టైలర్ దగ్గరకు వెళ్లి కుట్టించుకోవడమనేది సమయాన్ని వృథా చేసేస్తుంది. ఈ తరహా సమస్యలకు పరిష్కారంగానే మేం టైలర్‌ఫిట్స్‌ను ప్రారంభించాం’అని చెప్పారు రోహతేష్ హుర్రియా.
కుట్టు, కూలీ.. అన్నీ ఇంటర్నెట్‌లోనే..
ఈ సర్వీసు పూర్తిగా ఆన్‌లైన్, డోర్ స్టెప్‌గా అందిస్తున్నామని రోహతేష్ చెప్పారు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండానే తమ దుస్తులు కుట్టించుకునే అవకాశ ం దీని ద్వారా మహిళలకు కలుగుతుందన్నారు. ‘మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి కావల్సిన ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే విభిన్న రకాల స్టిచ్చింగ్ శైలుల నుంచి నచ్చింది కోరుకోవచ్చు. క్లయింట్ డిమాండ్ ప్రకారం సంస్థకు చెందిన వ్యక్తులు వచ్చి మా ద్వారా కొనుగోలు చేసిన ఫ్యాబ్రిక్ అయినా లేదా అప్పటికే ఫ్యాబ్రిక్ కొని ఉంటే దానిని, దానికి అనుబంధంగా కొలతల కోసం మరొక గార్మెంట్‌ను తీసుకువె ళ్తారు. వీటిని ప్రొఫెషనల్ టైలర్స్ ద్వారా కచ్చితమైన విధంగా స్టిచ్ చేయించి కుట్టిన డ్రెస్‌ని ఇంటికి తెచ్చి ఇస్తాం. దీని కోసం గరిష్టంగా 10 రోజుల వ్యవధి పడుతుంది. దీనికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆర్డర్ బుక్ చేసినప్పుడు లేదా కుట్టిన డ్రెస్ డెలివరీ తీసుకున్నప్పుడైనా చెల్లించొచ్చు’ అని రోహతేష్ వివరించారు. ‘ప్రస్తుతం మహిళల బ్లౌజ్, కుర్తీ, బాటమ్స్, డ్రెస్‌లు, ఎత్నిక్ వేర్.. వంటివి అందిస్తున్నాం. ఇప్పటికైతే హైదరాబాద్ క్లయింట్స్ బాగా ఉన్నారు. విభిన్న ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలున్నాయి. ఇంకా మరిన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌ను సైతం మా కస్టమర్లకు అందించనున్నా’మన్నారు రోహతేష్.