Tyler
-
ఇక కొలతల్లేవ్..‘టచ్ స్క్రీన్’ టైలర్ వచ్చేసింది!
-
‘టచ్ స్క్రీన్’ టైలర్
• వస్త్ర ప్రపంచంలో వినూత్న సేవలు.. • భాగ్యనగరిలో కొటియోర్ స్టోర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ అయితే ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. ఇవి నచ్చనివారైతే టైలర్ దగ్గరకు వెళ్లి దుస్తులు కుట్టించుకుంటారు. టైలర్ పనితనంపైనే డ్రెస్ తుది రూపు ఆధారపడి ఉంటుంది. కొలతల్లో ఖచ్చితత్వంతోపాటు డ్రెస్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో ముందే చూసుకోగలిగితే.. ప్రీమియం వస్త్రాల పంపిణీలో ఉన్న జార్జియా గుల్లిని ఫ్యాషన్స్ ఈ సేవలను భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన కొటియోర్ స్టోర్లలో టచ్ స్క్రీన్ అనే ప్రత్యేక పరికరం ముందు కస్టమర్ నిలుచుంటే చాలు. మూడు నిముషాల్లో 3డీ రూపంలో కొలతలు తీసుకుంటుంది. షర్ట్, ప్యాంట్, సూట్.. ఇలా వినియోగదారు తాను ఎంచుకున్న వస్త్రంతో ఏది కావాలంటే అది స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంటే కస్టమర్ నిజంగా వాటిని వేసుకున్నట్టే చూపిస్తుంది. వినియోగదారు తనకు నచ్చిన డిజైన్‌లో దుస్తులను సిద్ధం చేసుకోవచ్చన్న మాట. అనుభూతి కోసం.. జార్జియా గుల్లిని గ్వాలియర్, నాగ్‌పూర్‌లో ఇప్పటికే కొటియోర్ స్టోర్లను తెరిచింది. తాజాగా దక్షిణాదిన తొలిసారిగా హైదరాబాద్ రికబ్గంజ్లోని చిమన్లాల్ సురేష్ కుమార్ (సీఎస్కే) టెక్స్‌టైల్స్‌లో షాప్ ఇన్ షాప్‌ను ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల్లో మరో మూడు నగరాల్లో ఫ్రాంచైజీ ఔట్లెట్లను ప్రారంభిస్తున్నట్టు జార్జియా గుల్లిని మార్కెటింగ్ హెడ్ విక్రం మాథుర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. దుస్తుల డిజైన్ విషయంలో కస్టమర్లకు వినూత్న అనుభూతి ఉంటుందని అన్నారు. ఫ్రాంచైజీ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు చెల్లిస్తే చాలని చెప్పారు. వస్త్రాలను తామే సరఫరా చేస్తామన్నారు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే వస్త్రాలు కుట్టేందుకు ఎటువంటి అదనపు చార్జీలు లేవన్నారు. సీఎస్కే విస్తరణ..: అయిదు దశాబ్దాలకుపైగా వస్త్ర వ్యాపారంలో ఉన్న సీఎస్కే టెక్స్టైల్స్ మే నాటికి మెహిదీపట్నంలో దుకాణాన్ని తెరుస్తోంది. హైదరాబాద్‌లో డిసెంబర్‌కల్లా మరో నాలుగు స్టోర్లు ప్రారంభిస్తామని కంపెనీ డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. 100కుపైగా బ్రాండ్ల వస్త్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో 1,000కిపైగా రిటైలర్లకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఏడాదిన్నరలో 10 కొటియోర్ స్టోర్లను ఫ్రాంచైజీలో తెరుస్తామని మరో డైరెక్టర్ రక్షిత్ అగర్వాల్ వెల్లడించారు. సీఎస్కే గ్రూప్ కంపెనీ అయిన సీఎస్కే రియాల్టర్స్‌కు డీఎల్ఎఫ్ వంటి ప్రముఖ కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. -
అదిరేట్టు.. ఆన్ లైన్ కుట్టు
మహిళలు డ్రెస్‌లు, బ్లౌజ్‌లు తదితరాలకు తొలుత ఫ్యాబ్రిక్ కోసం షాపింగ్ చేయాలి. ఆ తర్వాత చక్కగా కుట్టిచ్చే టైలర్ కోసం అన్వేషించాలి. టైలర్ దొరికాక అతను చెప్పిన వ్యవధి వరకూ ఆగి, అప్పుడు వెళ్లి చార్జీలు చెల్లించి దుస్తులు తెచ్చుకోవాలి. ఇదంతా చెప్పడానికి తేలిగ్గా ఉన్నా.. చేయడం కాస్త ఇబ్బందే. ఆధునిక బిజీ మహిళలకు ఇది మరింత ఒత్తిడి పెంచే పనే. అయితే అనంతకోటి సమస్యలకు ఆన్లైనే సమాధానమన్నట్టుగా మారిపోతున్న క్రమంలో.. ఇప్పుడు ఆన్లైన్ టైలర్స్ వచ్చేశారు. - సిద్ధాంతి ‘మన భారతీయ టైలరింగ్ పరిశ్రమలో ప్రొఫెషనల్స్ కాని స్థానిక టైలర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో మహిళలకు కచ్చితమైన ఫిట్‌కి సంబంధించి తమ దుస్తులు చేతికి వచ్చే వరకూ సందేహాలు, ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రోజువారీ పని ఒత్తిడి కారణంగా దుస్తులు కొని, దూరంగా ఎక్కడో ఉన్న టైలర్ దగ్గరకు వెళ్లి కుట్టించుకోవడమనేది సమయాన్ని వృథా చేసేస్తుంది. ఈ తరహా సమస్యలకు పరిష్కారంగానే మేం టైలర్ఫిట్స్ను ప్రారంభించాం’అని చెప్పారు రోహతేష్ హుర్రియా. కుట్టు, కూలీ.. అన్నీ ఇంటర్నెట్లోనే.. ఈ సర్వీసు పూర్తిగా ఆన్లైన్, డోర్ స్టెప్‌గా అందిస్తున్నామని రోహతేష్ చెప్పారు. ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండానే తమ దుస్తులు కుట్టించుకునే అవకాశ ం దీని ద్వారా మహిళలకు కలుగుతుందన్నారు. ‘మా వెబ్సైట్లోకి లాగిన్ అయి కావల్సిన ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే విభిన్న రకాల స్టిచ్చింగ్ శైలుల నుంచి నచ్చింది కోరుకోవచ్చు. క్లయింట్ డిమాండ్ ప్రకారం సంస్థకు చెందిన వ్యక్తులు వచ్చి మా ద్వారా కొనుగోలు చేసిన ఫ్యాబ్రిక్ అయినా లేదా అప్పటికే ఫ్యాబ్రిక్ కొని ఉంటే దానిని, దానికి అనుబంధంగా కొలతల కోసం మరొక గార్మెంట్‌ను తీసుకువె ళ్తారు. వీటిని ప్రొఫెషనల్ టైలర్స్ ద్వారా కచ్చితమైన విధంగా స్టిచ్ చేయించి కుట్టిన డ్రెస్‌ని ఇంటికి తెచ్చి ఇస్తాం. దీని కోసం గరిష్టంగా 10 రోజుల వ్యవధి పడుతుంది. దీనికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆర్డర్ బుక్ చేసినప్పుడు లేదా కుట్టిన డ్రెస్ డెలివరీ తీసుకున్నప్పుడైనా చెల్లించొచ్చు’ అని రోహతేష్ వివరించారు. ‘ప్రస్తుతం మహిళల బ్లౌజ్, కుర్తీ, బాటమ్స్, డ్రెస్‌లు, ఎత్నిక్ వేర్.. వంటివి అందిస్తున్నాం. ఇప్పటికైతే హైదరాబాద్ క్లయింట్స్ బాగా ఉన్నారు. విభిన్న ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలున్నాయి. ఇంకా మరిన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌ను సైతం మా కస్టమర్లకు అందించనున్నా’మన్నారు రోహతేష్. -
ఆ హక్కు నాకు లేదా?
వేదిక ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నాన్న శవాన్ని ముందు పెట్టుకుని అమ్మ ఏడుస్తోంది. అయిదో తరగతి చదువుతున్న నేను, ఒకటో తరగతి చదువుతోన్న చెల్లి జరిగేదంతా చూస్తున్నాం. నాన్న ఇక రారని అర్థమయ్యి నేను ఏడుస్తున్నాను. చెల్లికి అది కూడా అర్థం కాలేదు. అందరూ ఏడుస్తుంటే అదీ ఏడుస్తోంది. ఆ రోజు అమ్మను ఓదారుస్తున్న ఒకావిడ ‘‘దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు. నీ భర్తను తీసుకుపోయాడు, కనీసం ఒక మగపిల్లాడుంటే నీకు అండ అయ్యేవాడు, ఇద్దరూ ఆడపిల్లలైపోయారు...’’ అని అన్న మాటలను బట్టి మగపిల్లాడయితే అండ, ఆడపిల్ల అయితే బండ అని అందరూ అనుకుంటారన్న విషయం ఆ చిన్న వయసులోనే అర్థమైంది. దాంతో అమ్మకి బరువు కాకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగో పదో తరగతి వరకూ చదివాను. చెల్లెలిని చదివిద్దాం అని అమ్మతో చెప్పి, ఓ టైలర్ దగ్గర సహాయకురాలిగా చేరాను. పని వచ్చాక ఫాల్స్ కుట్టడం, చిరిగిన బట్టలకు చేతి కుట్లు వేసివ్వడం లాంటి పనులు చేసేదాన్ని. అమ్మ రెండు మూడిళ్లలో పని చేసేది. తనకు వచ్చేవి ఇంటి ఖర్చులకు సరిపోయేవి. నాకు వచ్చే దానిలో చెల్లెలి చదువుకి ఖర్చు పెడుతూ, కొద్ది కొద్దిగా వెనకేసుకుంటూ, ఎలాగైతేనేం... కొన్నేళ్లకు కుట్టు మిషను కొనుక్కున్నాను. దాంతో ఇంటి దగ్గర బట్టలు కుట్టడం మొదలుపెట్టాను. అందరికీ నా పని నచ్చడంతో తొందరలోనే మా ఇంటినే టైలరింగ్ షాపుగా మార్చాల్సి వచ్చింది. దాంతో పూర్తిస్థాయిలో ఇంటి దగ్గరే పని చేసేదాన్ని. నా కష్టం ఫలించింది. ఇప్పుడు నాకో షాపు ఉంది. నాలుగు మిషన్లు పెట్టి, నలుగురితో పని చేయిస్తున్నా. అమ్మతో పని మానిపించేశాను. చెల్లెలిని చదివిస్తున్నాను. నాకు జీవితంలో అనుకున్నవన్నీ జరిగాయన్న తృప్తి ఉంది. కానీ నన్ను చూస్తున్న వాళ్లు మాత్రం పలకరిస్తే చాలు పెళ్లెప్పుడంటున్నారు. నాకయితే చెల్లెలు జీవితంలో స్థిరపడాలి. తనకి పెళ్లి చేయాలి. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయలేనని కాదు. చేయలేని పరిస్థితి వస్తే ఎలా అని! పెళ్లే జీవితం అని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు ఆ జీవితం మీద పెద్దగా కలలు కూడా లేవు. అయినా అందరూ నన్ను బలవంత పెడుతున్నారు. మా అమ్మ కూడా అలానే ఆలోచిస్తుందేమోనని భయపడ్డాను కానీ, తను నా ఇష్టాన్నే గౌరవిస్తోంది. చుట్టుపక్కల వాళ్లంతా వంకరగా మాట్లాడి మమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్లను నేనొక్కటే అడుగుతున్నాను... నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదా? నాకంటూ ఇష్టానిష్టాలుండవా? అది నా స్వవిషయమని, నా నిర్ణయాన్ని ఎత్తి చూపకూడదని, హేళన చేసి బాధపెట్టకూడదని ఎందుకు అనుకోరు! - విజయలక్ష్మి, గోకవరం, తూ.గో. -
చేతబడి అనుమానంతోనే...
ఉప్పల్, న్యూస్‌లైన్: రామంతాపూర్‌లో ఈనెల 12న జరిగిన రాముల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యకు చేతబడి చేశాడనే అనుమానంతో సమీప బంధువే అతడి ప్రాణం తీశాడు. మల్కాజిగిరి ఏసీపీ రాధకిషన్‌రావు శుక్రవారం ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేటకు చెందిన వంజముల పెద్ద కృష్ణ(38) రామంతాపూర్ కృష్ణానగర్‌లో ఉంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఇతని భార్య చింతమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో మంత్రాగాళ్లను ఆశ్రయించాడు. చింతమ్మకు చేతబడి చేశారని మంత్రగాళ్లు చెప్పడంతో తమ ఇంటి పక్కనే ఉండే బంధువు రాములుపై పెద్దకృష్ణకు అనుమానం వచ్చింది. రాములు బాణామతి చేస్తాడనే ప్రచారం అతని స్వగ్రామంలో గతంలో ఉండేది. ఈనేపథ్యంలోనే తన భార్య అనారోగ్యం బారినపడటానికి రాములే కారణమని, అతడిని హతమార్చాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. దసరాకు రాములు బార్య ఊరెళ్లడంతో ఇదే అదనుగా భావించిన కృష్ణ అతడిని హత్య చేసేందుకు పథకం వేశాడు. ఈనెల 12న సాయంత్రం శ్రీరాంకాలనీలో ఉండే తన స్నేహితుడు పబ్బాల చెన్నయ్య (25)తో పాటు రాములును మద్యం తాగుదామని రామంతాపూర్‌లోని గడ్డిపొలాల్లోకి తీసుకెళ్లాడు. ముగ్గురూ మద్యం తాగారు. ఇంకా మద్యం తీసుకురావాలని చెన్నయ్యను కృష్ణ పంపాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న రాములను తలపై సిమెంట్ ఇటుకలతో మోది చంపేశాడు. మొలకు తావిత్తులు ఉన్నాయేమోనన్న అనుమానంతో దుస్తులు విప్పి, మర్మావయవాలను సైతం కోసే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మద్యం తీసుకుని తిరిగి వస్తున్న చెన్నయ్యకు మార్గంమద్యలో కృష్ణ ఎదురయ్యాడు. అతని తీరుపై అనుమానం వచ్చి రాములు ఏడని చెన్నయ్య నిలదీయగా... చంపేశానని, ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్నుకూడా చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ చెన్నయ్య ఈ హత్యపై ఎక్కడా నోరు విప్పలేదు. విచారణ చేపట్టిన పోలీసులకు బంధువైన కృష్ణపై అనుమానం వచ్చి విచారించగా తానే రాములును హత్య చేశానని చెప్పాడు. హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు చెన్నయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఎస్ఐ ముక్బుల్ జానీ పాల్గొన్నారు.