ఉప్పల్, న్యూస్‌లైన్: రామంతాపూర్‌లో ఈనెల 12న జరిగిన రాముల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యకు చేతబడి చేశాడనే అనుమానంతో సమీప బంధువే అతడి ప్రాణం తీశాడు. మల్కాజిగిరి ఏసీపీ రాధకిషన్‌రావు శుక్రవారం ఉప్పల్ పోలీసుస్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేటకు చెందిన వంజముల పెద్ద కృష్ణ(38) రామంతాపూర్ కృష్ణానగర్‌లో ఉంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు.
కొంతకాలంగా ఇతని భార్య చింతమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో మంత్రాగాళ్లను ఆశ్రయించాడు. చింతమ్మకు చేతబడి చేశారని మంత్రగాళ్లు చెప్పడంతో తమ ఇంటి పక్కనే ఉండే బంధువు రాములుపై పెద్దకృష్ణకు అనుమానం వచ్చింది. రాములు బాణామతి చేస్తాడనే ప్రచారం అతని స్వగ్రామంలో గతంలో ఉండేది. ఈనేపథ్యంలోనే తన భార్య అనారోగ్యం బారినపడటానికి రాములే కారణమని, అతడిని హతమార్చాలని కృష్ణ నిర్ణయించుకున్నారు.
దసరాకు రాములు బార్య ఊరెళ్లడంతో ఇదే అదనుగా భావించిన కృష్ణ అతడిని హత్య చేసేందుకు పథకం వేశాడు. ఈనెల 12న సాయంత్రం శ్రీరాంకాలనీలో ఉండే తన స్నేహితుడు పబ్బాల చెన్నయ్య (25)తో పాటు రాములును మద్యం తాగుదామని రామంతాపూర్‌లోని గడ్డిపొలాల్లోకి తీసుకెళ్లాడు. ముగ్గురూ మద్యం తాగారు. ఇంకా మద్యం తీసుకురావాలని చెన్నయ్యను కృష్ణ పంపాడు.
ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న రాములను తలపై సిమెంట్ ఇటుకలతో మోది చంపేశాడు. మొలకు తావిత్తులు ఉన్నాయేమోనన్న అనుమానంతో దుస్తులు విప్పి, మర్మావయవాలను సైతం కోసే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మద్యం తీసుకుని తిరిగి వస్తున్న చెన్నయ్యకు మార్గంమద్యలో కృష్ణ ఎదురయ్యాడు. అతని తీరుపై అనుమానం వచ్చి రాములు ఏడని చెన్నయ్య నిలదీయగా... చంపేశానని, ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్నుకూడా చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ చెన్నయ్య ఈ హత్యపై ఎక్కడా నోరు విప్పలేదు.
విచారణ చేపట్టిన పోలీసులకు బంధువైన కృష్ణపై అనుమానం వచ్చి విచారించగా తానే రాములును హత్య చేశానని చెప్పాడు. హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు చెన్నయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఎస్‌ఐ ముక్బుల్ జానీ పాల్గొన్నారు.
చేతబడి అనుమానంతోనే...
Published Sat, Oct 26 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement