సినిమా అంటే ఓ నాలుగు పాటలు... ఓ నాలుగు ఫైట్లు అనే ధోరణి చాలామందిలో ఉంటుంది. కానీ వాటిని తెరమీదకు తీసుకొచ్చేందేకు పడే కష్టం అంతాఇంతా కాదు. తాము కంపోజ్ చేసిన డ్యాన్స్ లేదా ఫైట్‌ను అంతేఅద్భుతంగా తెర మీదచూపేందుకు ఎంతో కష్టపడతారు మాస్టర్లు. సినిమాకు ప్రాణమైన డ్యాన్స్, ఫైట్‌లను కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్లర్లకు కేంద్రం కృష్ణానగర్. వీరికి సహాయ సహకారం అందించే డ్యాన్సర్లు, ఫైటింగ్ కళాకారులకూ ఇదే అడ్డా.
బంజారాహిల్స్: ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లను చెన్నై నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ తర్వాతి కాలంలో యూనియన్లు ఏర్పడ్డాయి. సినీ అవకాశాల కోసం వచ్చేవారు కృష్ణానగర్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది జూనియర్ ఆర్టిస్ట్‌లుగా ఇక్కడ అవకాశం పొందుతున్నారు. దీంతో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పింది. ఇక ఫైట్ మాస్టర్లూ గతంలో చెన్నై నుంచే వచ్చేవారు. వారు కూడా ఇప్పుడు నగరంలోనే అందుబాటులో ఉన్నారు. అంతా కృష్ణానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లోనే వీరుంటున్నారు.
తెర వెనుక హీరోలు...
గతంలో డ్యాన్స్ లేదా ఫైట్ గురించి ముందుగా దర్శకత్వం విభాగంతో చర్చించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్‌స్టంట్‌గా అన్నీ కావాలని డైరెక్టర్లు కోరుకుంటున్నారు. అనుభవమున్న ఫైట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు తెరపై తమ ప్రతిభ చూపుతున్నారు. తెరపై హీరోలు అద్భుతంగా డ్యా న్స్ చేసినా, ఆహా.. అనుకునేలా ఫైట్లు చేసినా... ఆ కష్టమంతా తెరవెనుకున్న వీరిదే. డ్యాన్స్ విషయం లో హీరాలాల్ మాస్టర్ సినీ పరిశ్రమకు ఓ గుర్తింపు తీసుకొచ్చారు. అప్పుడు కేవలం ఐదారుగురే డ్యా న్సర్లు ఉండేవారు. సలీం మాస్టర్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య 20 వరకు చేరింది. అయితే అప్పుడు తమిళం, మళయాలం, భోజ్‌పురి, తెలుగు, కన్నడ... ఇలా అన్ని భాషాలకు వీరే మాస్టర్లుగా ఉం డేవారు. యూనియన్లు ఏర్పడిన తర్వాత డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఇక్కడే అవకాశాలు లభిస్తున్నాయి.
ఒకప్పుడు చాలా తక్కువ మంది ఫైట్ మాస్టర్లు ఉండేవారు. దీంతో చెన్నై నుంచి మాస్టర్లు వచ్చేవారు. అయితే స్థానిక యూనియన్లు ఏర్పాటుతో పరిస్థితి మారింది. ఇందిరానగర్, కృష్ణానగర్‌లలోని యూనియన్లలోనే చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. రామ్‌లక్ష్మణ్, విజయ్, సాల్మాన్‌రాజ్ తదితర మాస్టర్లు ఇక్కడివారే. ఒకప్పుడు సినిమాల్లో ప్రమాదకర సన్నివేశాల్లో హీరోలకు డూపుగా ఫైట్ మాస్టర్లు లేదా జూనియర్ ఆర్టిస్టులు నటించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది కథానాయకులు తామే సొంతంగా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. దీంతో కొంతమంది కథానాయకులు ఇప్పటికీ డూప్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు.
డూప్ టు రియల్...గుర్తుండిపోవాలి...
సినిమాల్లో కొరియోగ్రాఫర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలినాళ్లలో దర్శకులు కథను చెప్పి అందుకనుగుణంగా డ్యాన్స్ కంపోజ్ చేయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రాక్ ఇచ్చి డ్యాన్స్ కావాలంటున్నారు. అది ఒకరోజు ముందుగా ఇస్తారంతే.. అయితే అనుభవమున్న కొరియోగ్రాఫర్లకు ఇదేం పెద్ద సమస్య కాదు. నేను ఇప్పటికి దాదాపు 800 సినిమాలు చేశాను. భారతీరాజా దర్శకత్వంలో మొదలైన నా ప్రయాణం తాజా ఆర్‌ఎక్స్ 100 వరకు కొనసాగుతూనే ఉంది. కొరియోగ్రఫీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలన్నదే నా అభిప్రాయం. – స్వర్ణ, డ్యాన్స్ మాస్టర్
మళ్లీ రియల్...
తొలి రోజుల్లో ప్రమాదకర సన్నివేశాల్లో డూపులుగా నటించాల్సి వచ్చేది. అయితే టెక్నాలజీ రావడంతో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ మాయాజాలం ఉండేది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డూపు సన్నివేశాలను ప్రేక్షకులు కోరుకోవడం లేదు. దీంతో చాలామంది హీరోలు సహజంగా నటించేందుకే మొగ్గు చూపుతున్నారు. రంగస్థలం సినిమాలో అంతా సహజత్వం ఉట్టిపడుతుంది. ఇందులో చాలామంది కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్‌లు అవకాశం పొందారు. – రామ్‌లక్ష్మణ్, ఫైట్ మాస్టర్లు
సొంతంగాస్టూడియోలు...
ఒకప్పుడు డ్యాన్స్, ఫైట్స్‌కు సంబంధించి లోకేషన్‌లోనే రిహార్సల్స్ ఉండేవి. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రముఖ హీరోలందరికీ సొంతంగా స్టూడియోలు వచ్చాయి. డ్యాన్స్, ఫైట్, జిమ్.. ఇలా ఏదైనా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. మాస్టర్లు అక్కడికే వెళ్లి నేర్పిస్తున్నారు. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు అవకాశాలు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment