ఆ హక్కు నాకు లేదా?
వేదిక
ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నాన్న శవాన్ని ముందు పెట్టుకుని అమ్మ ఏడుస్తోంది. అయిదో తరగతి చదువుతున్న నేను, ఒకటో తరగతి చదువుతోన్న చెల్లి జరిగేదంతా చూస్తున్నాం. నాన్న ఇక రారని అర్థమయ్యి నేను ఏడుస్తున్నాను. చెల్లికి అది కూడా అర్థం కాలేదు. అందరూ ఏడుస్తుంటే అదీ ఏడుస్తోంది.
ఆ రోజు అమ్మను ఓదారుస్తున్న ఒకావిడ ‘‘దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు. నీ భర్తను తీసుకుపోయాడు, కనీసం ఒక మగపిల్లాడుంటే నీకు అండ అయ్యేవాడు, ఇద్దరూ ఆడపిల్లలైపోయారు...’’ అని అన్న మాటలను బట్టి మగపిల్లాడయితే అండ, ఆడపిల్ల అయితే బండ అని అందరూ అనుకుంటారన్న విషయం ఆ చిన్న వయసులోనే అర్థమైంది. దాంతో అమ్మకి బరువు కాకూడదని నిర్ణయించుకున్నాను.
ఎలాగో పదో తరగతి వరకూ చదివాను. చెల్లెలిని చదివిద్దాం అని అమ్మతో చెప్పి, ఓ టైలర్ దగ్గర సహాయకురాలిగా చేరాను. పని వచ్చాక ఫాల్స్ కుట్టడం, చిరిగిన బట్టలకు చేతి కుట్లు వేసివ్వడం లాంటి పనులు చేసేదాన్ని. అమ్మ రెండు మూడిళ్లలో పని చేసేది. తనకు వచ్చేవి ఇంటి ఖర్చులకు సరిపోయేవి. నాకు వచ్చే దానిలో చెల్లెలి చదువుకి ఖర్చు పెడుతూ, కొద్ది కొద్దిగా వెనకేసుకుంటూ, ఎలాగైతేనేం... కొన్నేళ్లకు కుట్టు మిషను కొనుక్కున్నాను. దాంతో ఇంటి దగ్గర బట్టలు కుట్టడం మొదలుపెట్టాను. అందరికీ నా పని నచ్చడంతో తొందరలోనే మా ఇంటినే టైలరింగ్ షాపుగా మార్చాల్సి వచ్చింది. దాంతో పూర్తిస్థాయిలో ఇంటి దగ్గరే పని చేసేదాన్ని. నా కష్టం ఫలించింది. ఇప్పుడు నాకో షాపు ఉంది. నాలుగు మిషన్లు పెట్టి, నలుగురితో పని చేయిస్తున్నా. అమ్మతో పని మానిపించేశాను. చెల్లెలిని చదివిస్తున్నాను.
నాకు జీవితంలో అనుకున్నవన్నీ జరిగాయన్న తృప్తి ఉంది. కానీ నన్ను చూస్తున్న వాళ్లు మాత్రం పలకరిస్తే చాలు పెళ్లెప్పుడంటున్నారు. నాకయితే చెల్లెలు జీవితంలో స్థిరపడాలి. తనకి పెళ్లి చేయాలి. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయలేనని కాదు. చేయలేని పరిస్థితి వస్తే ఎలా అని! పెళ్లే జీవితం అని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు ఆ జీవితం మీద పెద్దగా కలలు కూడా లేవు. అయినా అందరూ నన్ను బలవంత పెడుతున్నారు. మా అమ్మ కూడా అలానే ఆలోచిస్తుందేమోనని భయపడ్డాను కానీ, తను నా ఇష్టాన్నే గౌరవిస్తోంది. చుట్టుపక్కల వాళ్లంతా వంకరగా మాట్లాడి మమ్మల్ని బాధ పెడుతున్నారు.
వాళ్లను నేనొక్కటే అడుగుతున్నాను... నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదా? నాకంటూ ఇష్టానిష్టాలుండవా? అది నా స్వవిషయమని, నా నిర్ణయాన్ని ఎత్తి చూపకూడదని, హేళన చేసి బాధపెట్టకూడదని ఎందుకు అనుకోరు!
- విజయలక్ష్మి, గోకవరం, తూ.గో.