
ఆపరేషన్ చేశాం.. బ్లేడు వదల్లేదు
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): మహబూబ్‌నగర్ జిల్లాలోని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో ఓ మహిళ కడుపులో బ్లేడును వదిలేశారని ఓ పత్రిక (సాక్షి కాదు) లో వచ్చిన కథనం అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కోఠిలోని తెలంగాణ వైద్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్‌రెడ్డితో కలసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వీరేశం, పుట్లా శ్రీనివాస్, డాక్టర్ జోయల్ సునీల్ మాట్లాడారు.
ఆగస్టు 20న బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ వైద్య శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకున్న సరోజ కడుపులో డాక్టర్లు బ్లేడ్ వదిలేశారంటూ వచ్చిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. పది రోజులపాటు కడుపులో బ్లేడు ఉంటే అది పేగుల్లో ఇరుక్కుపోయి చనిపోయే ప్రమాదం ఉండేదని, కాని సదరు రోగి ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కొందరు ప్రభుత్వ వైద్యుల ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ మహిళకు చికిత్స చేసిన స్థానిక వైద్యుడు సైతం కడుపులో బ్లేడు ఉందని నిర్ధారించలేదని తెలిపారు. ప్రస్తుతం సరోజ అనే ఆ మహిళ ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు. తమ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేసిన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు.